Central Team At Kadapa : ఏపీలోని కడప జిల్లాలో భారీ వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం శనివారం జిల్లాలో పర్యటించింది. ముందుగా పులపుత్తూరు గ్రామం వెళ్లిన అధికారులు.. చెయ్యేరునది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ప్రవాహం గురించి జిల్లా కలెక్టర్ విజయరామరాజును అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం, కూలిన ఇళ్లపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన పరిశీలించారు. పులపుత్తూరు నుంచి మందపల్లి చేరుకొని అక్కడ కోతకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న పంట పొలాల వివరాలు తెలుసుకున్నారు. మందపల్లిలో 10 వేల బస్తాల ధాన్యం నీటిపాలైందని కేంద్ర బృందానికి రైతులు వివరించారు.
మట్టికట్ట తెగిపోవడానికి కారణమేంటి?
Central Team inspects crop damage in kadapa: మందపల్లి నుంచి అధికారులు.. అన్నమయ్య జలాశయ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాజెక్టులో ప్రవాహం తగ్గిపోవడం వల్ల కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టికట్ట తెగిపోవడానికి కారణమేంటని ఏపీ అధికారులను ప్రశ్నించారు. పింఛ జలాశయం కోతకు గురవడం వల్ల ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో ప్రవాహం పెరిగిందని అధికారులు వివరించారు. జలాశయం గేట్ల పైనుంచి ప్రవాహం ఉబకడం వల్లే మట్టికట్ట తెగిందన్నారు. పదేళ్లలో అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రవాహ వివరాలు, జలాశయం సామర్థ్యం, లోటుపాట్లపైనా కేంద్ర బృందం ఆరా తీసింది.