తెలంగాణ

telangana

ETV Bharat / city

Central on Polavaram : 'పోలవరం ఆలస్యం.. ఏపీ వైఫల్యమే'

Central on Polavaram : ఏపీ ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని కేంద్ర సర్కార్ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. ఆ రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడమే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమని వెల్లడించింది.

Central on Polavaram
Central on Polavaram

By

Published : Jul 20, 2022, 7:43 AM IST

Central on Polavaram : పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఇంత జాప్యం జరగడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే కారణమని కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలుకొట్టింది. సాక్షాత్తూ రాజ్యసభ వేదికగా మంగళవారం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టంగా ఈ విషయం తేల్చేసింది. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు 2022 ఏప్రిల్‌కు పూర్తి చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదని, తాజాగా 2024 జూన్‌ నాటికి పూర్తి చేయనున్నామని ఆయన వెల్లడించారు. అంతే కాదు, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోపాలున్నాయి.. ఎక్కడ జాప్యం జరుగుతోందో ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన వ్యూహం, ప్రణాళిక లేదని ఆ సమాధానంలో తేల్చి చెప్పారు. సరైన నిర్వహణ ప్రణాళిక లేకపోవడంతోపాటు కొవిడ్‌వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని తేల్చారు.

‘‘పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తోంది. 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ప్రధాన డ్యాం 77 శాతం, కుడి కాలువ 93శాతం, ఎడమ కాలువ 72 శాతం పూర్తయింది. దీంతో 2022 ఏప్రిల్‌కు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యం తప్పింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలియజేసింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 నవంబరులో ఒక కమిటీని నియమించింది.

సమగ్రంగా అధ్యయనం చేసి ఎప్పటికి పూర్తి చేయగలరో, అసలు ఇంత ఆలస్యానికి కారణాలు ఏమిటో తెలియజేయాలని కమిటీని కోరింది. అన్నీ అధ్యయనం చేసి 2022 ఏప్రిల్‌లో పోలవరం అథారిటీకి కమిటీ నివేదిక సమర్పించింది. 2024 జూన్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలరని సవరించిన షెడ్యూలు ఇచ్చింది...’’ అని కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు వివరించారు.

‘‘ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందో ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తోంది(ఇంప్లిమెంటింగు ఏజెన్సీ). రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణంపై చాలినన్ని నిధులు ఖర్చు చేసే సామర్థ్యం లేదు. వ్యూహాత్మక ప్రణాళిక లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సమన్వయం చేయడం లేదు. కాంట్రాక్టు నిర్వహణ, నిర్మాణం చాలినంతగా లేదు...’’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ వైఫల్యాలను తేల్చి చెప్పింది. కొవిడ్‌ కూడా పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ఒక కారణమని కేంద్రం పేర్కొంది. ఈ పనులను ప్రస్తుతం మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ చేపట్టింది.

మూడేళ్లుగా చుట్టుముడుతున్న సమస్యలు..పోలవరం ప్రాజెక్టును మూడేళ్లుగా ఇవే సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వస్తున్నాయో కేంద్రం దాదాపు వాటిని సమర్థించినట్లుగానే అధికారిక ప్రకటన ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పోలవరం పనులు వేగవంతం చేయలేదు. 8 నెలల పాటు ఆగిపోయాయి. మళ్లీ టెండర్లు పిలిచారు. పాత గుత్తేదారు పనులు సవ్యంగా చేస్తున్నా ఎందుకు మళ్లీ టెండర్లు పిలవడం అంటూ ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

కొత్త గుత్తేదారు వస్తే పనుల్లో ఏదైనా లోపం జరిగితే ఇంతమంది గుత్తేదారుల్లో ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని కోరింది. ఈ లోపు టెండర్లు ఖరారు చేసి గుత్తేదారుకు అప్పచెప్పిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. టెండర్లు పిలవగా ఒకే ఒక గుత్తేదారు ఏజన్సీ మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ ముందుకు వచ్చింది. వారు అంచనా ధర కన్నా తక్కువకు చేస్తామనడంతో ఏకైక టెండర్‌ దాఖలు చేసినా.. వారికే అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

ఆ తర్వాత మరో రూ.683 కోట్ల పనులు అదనంగా చేయాలంటూ మళ్లీ అదే గుత్తేదారు సంస్థకు అప్పచెప్పారు. 2020 జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన వరదల సమయానికి కూడా కీలకమైన పనులు పూర్తి చేయలేకపోయారు. కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణమూ పూర్తి కాలేదు. పురోగతి అంతంతమాత్రంగానే ఉందని అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. దీంతో 2020 వరదలు భారీ నష్టం కలిగించాయి. ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. దిగువ కాఫర్‌ డ్యాం దెబ్బతింది. ఈ సమస్యల పరిష్కారం పెద్ద సవాల్‌గా మారింది. ఈ నష్ట నివారణ పనులకు కనీసం రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్లు అదనంగా ఖర్చయ్యే ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి.

ఎలా బయటపడాలో ఇప్పటివరకు తేలలేదు..అసలు ఈ సవాళ్ల నుంచి ఎలా బయటపడాలో ఇప్పటి వరకు తేలలేదు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాజెక్టును తాము ఎప్పటిలోగా పూర్తి చేయగలమో చెప్పలేమంటూ పదే పదే ప్రకటిస్తున్నారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టుల్లో అసలు గడువు చెప్పడం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఫలానా తేదీకి పూర్తి చేస్తామని ఎవరైనా చెప్పగలరా అని అడుగుతున్నారు. నిజానికి ప్రస్తుతం వరదలు వచ్చే లోపు దిగువ కాఫర్‌ డ్యాం 1,640 మీటర్ల మేర 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలి. ఈ పనులు వరదల్లోపు చేయలేకపోయారు. కిందటి ఏడాది జులైకే దిగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేస్తామని సాక్షాత్తూ కేంద్ర జల్‌శక్తి శాఖకు చెప్పిన వారు ఇప్పటికీ ఆ పని చేయలేదు.

తాజాగా వచ్చిన భారీ వరదలకు దిగువ కాఫర్‌ డ్యాం మునిగిపోయి ఎగువ కాఫర్‌ డ్యాం వరకు వరద నిండిపోయింది. వర్షాకాలంలోను పనులకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మిస్తారు. వరదల్లోపు ఆ పని చేయలేకపోవడం మరో వైఫల్యంగా మారింది. అక్కడ వరద నీరు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు. ఆగస్టు, సెప్టెంబరు నెలలు కూడా వరద కాలమే. పనులు చేసుకునేందుకు ఇదో కొత్త సవాల్‌గా మారింది. కేంద్రం పేర్కొన్నట్లు వ్యూహం, ప్రణాళిక లేదన్న మాటలకు తాజా చర్యలూ అద్దం పడుతున్నాయి. పోలవరం పనులు అగమ్యగోచరంగా మారిపోయాయన్న విమర్శలు ఇంజినీరింగు అధికారుల నుంచే వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details