పీఎంఏవై-జీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అస్సలు అమలు చేయలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఏడేళ్లలో కేటాయించిన ఇళ్లు, విడుదల చేసిన నిధులపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్... లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
70,674 ఇళ్ల కేటాయింపు...
2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదని కేంద్ర మంత్రి సాధ్వి వెల్లడించారు. 2016, 2017 ఆర్థిక సంవత్సరాలకు గానూ కేంద్ర ప్రభుత్వం... పీఎంఏవై పథకం కింద తెలంగాణకు 70,674 ఇండ్లను కేటాయించిందని పేర్కొన్నారు. అందుకోసం 190 కోట్ల 78 లక్షల 865 వేల రూపాయలను కూడా మంజూరు చేసిందని వివరించారు.
ఇప్పటివరకు అమలుకాలేదు..
ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా ఏడేళ్లలో తెలంగాణకు రూ. 849.01 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణలో 1,22,260 ఇళ్లను మంజూరు చేయగా... 48,550 ఇళ్లను మాత్రమే పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ ఇళ్లు నిర్మించాలనే గొప్ప లక్ష్యంతో నరేంద్ర మోదీ ఆధ్వర్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ నుంచి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (పీఎంఏవై-జీ) పథకాన్ని మాత్రం తెలంగాణ సర్కారు ఇప్పటి వరకు అమలు చేయడం లేదని తెలిపారు.
తిరిగి చెల్లించాలని ఆదేశం..
"సకాలంలో ఇండ్లు నిర్మించలేకపోయిన తెలంగాణ ప్రభుత్వంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా?" అని బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... కేంద్రం విడుదల చేసిన 190 కోట్ల 78 లక్షల 865 వేల రూపాయలను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆదేశించినట్లు స్పష్టం చేశారు.