KISHAN REDDY: అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను సోమవారం నుంచి వచ్చే సంవత్సరం జులై 4 వరకు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రకటించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దిల్లీ, విశాఖపట్నం, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహిస్తామని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రాంతాలన్నింటినీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని భీమవరం సభలో ఆయన ప్రసంగించారు.
‘ఈ ఏడాదంతా ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో అల్లూరి పేరు మార్మోగాలి. ఆయన కుటుంబీకుల్ని, ఆయనతో కలిసి పనిచేసిన గిరిజన సైన్యంలోని ముఖ్యులైన గంటం దొర, మల్లు దొర, వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాల్, శంకోజీ ముక్కడు, బొంకుల మోదిగాడు, భీమవరానికి చెందిన వేగిరాజు సత్యనారాయణ (అగ్గిరాజు) తదితరుల కుటుంబీకుల్ని కలుస్తాం’ అని కిషన్రెడ్డి తెలిపారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది త్యాగాలు, పోరాటాల్ని నవతరానికి తెలియజేస్తున్నాం. అందులో భాగంగా తెలుగు నేలపై పుట్టిన, తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మీరు భీమవరం రావాలని ప్రధానిని కోరిన వెంటనే ఆయన సమ్మతించారు’ అని కిషన్రెడ్డి చెప్పారు.
అల్లూరి పేరు మార్మోగుతుంది..‘స్వాతంత్య్ర పోరాటంలో గెరిల్లా యుద్ధం చేసిన ఏకైక వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు జాతి వాడీవేడిని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి చవి చూపించి వారి వెన్నులో వణుకు పుట్టించాడు’ అని అల్లూరి జయంత్యుత్సవాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నానిరాజు అన్నారు.