తెలంగాణ

telangana

ETV Bharat / city

Coarse Rice purchase: 'ఆ విషయం సీజను ప్రారంభానికి ముందే చెప్పాం' - piyush goyal letter about coarse rice purchase

తెలంగాణ నుంచి 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ఉప్పుడు బియ్యం(Coarse Rice purchase) తీసుకోలేమని కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​కు లేఖ రాశారు. ఇప్పటికే నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉండటం వల్ల అంతకు మించి తీసుకోలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​తో ఫోన్​లో మాట్లాడారు.

ఉప్పుడు బియ్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ
ఉప్పుడు బియ్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ

By

Published : Sep 17, 2021, 6:44 AM IST

రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు అదనంగా ఉప్పుడు బియ్యం(Coarse Rice purchase) తీసుకోలేం. ఇప్పటికే నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఎఫ్‌సీఐ(భారత ఆహార సంస్థ) వద్ద ఉన్నాయి. 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి ఉప్పుడు బియ్యం తీసుకోలేమని సీజను ప్రారంభానికి ముందే చెప్పాం. మీరు ఇచ్చిన వినతిపై చర్చించిన మీదట ఉప్పుడు బియ్యాన్ని మునుపటి మేరకే ఇవ్వాలి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ లేఖ రాశారు.

యాసంగిలో భారీగా దిగుబడి రావటంతో 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటి నుంచి 60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం వస్తాయి. 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం(Coarse Rice purchase), మిగిలినవి సాధారణ బియ్యంగా ఇవ్వాలని కేంద్రం గతేడాది డిసెంబరులో లేఖ రాసింది. కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం, మిగిలిన 12 లక్షల మెట్రిక్‌ టన్నుల సాధారణ బియ్యం ఇస్తామంటూ మంత్రులు ఇటీవల దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గోయల్‌తో పాటు పలువురు అధికారులను కలిశారు.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజాగా రాసిన లేఖ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ‘ఎఫ్‌సీఐ వద్ద 49.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం(Coarse Rice purchase) నిల్వలు ఉన్నాయి. మరో 19.31 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం ఈ సీజనులో రానుండటంతో 58 లక్షలు దాటుతాయి. వాటి వినియోగానికి నాలుగేళ్లు పడుతుంది. ఈ పరిస్థితుల్లో గతంలో పేర్కొన్నట్లు 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని మాత్రమే తీసుకునేందుకు ఎఫ్‌సీఐ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తెలంగాణ నుంచి 17 లక్షల టన్నులు అందాయి. మిగిలిన బియ్యం మాత్రమే ఇవ్వాలి’ అని కేంద్ర మంత్రి గోయల్‌ లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జోక్యంతో తర్జనభర్జన!

బియ్యం(Coarse Rice purchase) వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రి గోయల్‌ నుంచి లేఖ వచ్చిన నేపథ్యంలో బుధవారం రాత్రి ఆయనతో ముఖ్యమంత్రి ఫోన్‌ మాట్లాడి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఉప్పుడు బియ్యం(Coarse Rice purchase) తీసుకోకపోతే ప్రభుత్వంపై భారం పడుతుందని, దీంతోపాటు రైసు మిల్లులు ఇబ్బంది పడతాయని, ఉపాధిపై ప్రభావం చూపుతుందని, అదనపు బియ్యాన్ని తీసుకోవాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ జోక్యంతో కేంద్రం తర్జనభర్జన పడుతోంది. 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులు కాకుండా మరో 15- 20 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు అదనంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా.

ABOUT THE AUTHOR

...view details