KISHAN REDDY: 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. త్యాగధనుల గురించి తెలుసుకునేలా కార్యక్రమాలు చేపట్టామని.. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 2న పింగళి వెంకయ్య శత జయంతి వేడుకలను దిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని పింగళి స్వగ్రామమైన కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు వెళ్లి కుటుంబసభ్యులను కలిసి.. ప్రధాని తరఫున ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను ప్రధాని, అమిత్ షా సన్మానిస్తారని వెల్లడించారు. దిల్లీలో పింగళి ఫొటోతో పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తామని అలాగే.. ఆయన రూపొందించిన జాతీయ జెండాను ప్రదర్శిస్తామని తెలిపారు. ఆగస్టు 2న పింగళి జయంతి సభ వేదికపై పాటను విడుదల చేస్తామని ప్రకటించారు.
ఆగస్టు 13-15 వరకు దేశంలో ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. 'హర్ ఘర్ తిరంగా-ఘర్ ఘర్ తిరంగా' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్లపై జెండా ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 3న దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి విజయ్ చౌక్ వరకు యాత్ర ఉంటుందని తెలిపారు. మోటార్ సైకిల్‌పై తిరంగా యాత్రలో ఎంపీలు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆగస్టు 14న 'పాక్ విభజన్ కా విదుష్ కా స్మృతి దివస్' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 14న రాత్రి అందరూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న మహనీయుల విగ్రహాల వద్ద నివాళులర్పించాలని.. జాతీయ జెండాలు అన్ని తపాలా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. లంబసింగిలో రూ.35 కోట్లతో అల్లూరి మ్యూజియం నిర్మిస్తున్నామని ప్రకటించారు.