Kishan Reddy: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని... కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ మెమోరియల్ హైస్కూల్లో హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో... ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి.. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందరికీ వాక్సిన్ ఇస్తూ... కరోనాను అరికట్టేందుకు చేస్తున్న కృషి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. గతేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూనే ఉందన్నారు. మళ్లీ థర్డ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. పాడిపంటలు పశుసంపద బాగుండాలని... గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు చేసుకునే సంక్రాంతి పండుగ దేశంలోని 20కి పైగా రాష్ట్రాలు జరుపుకుంటున్నాయని తెలిపారు.