తెలంగాణ

telangana

ETV Bharat / city

Kishan Reddy: మందకృష్ణను పరామర్శించిన కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్​లో మందకృష్ణను పరామర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ పోరాడుతున్నారని చెప్పారు. మందకృష్ణ త్వరగా కోలుకుని.. లక్ష్య సాధనలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న సమయంలో తనకు అండగా నిలిచిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి ఎమ్మార్పీఎస్​ వ్యవస్థపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ధన్యవాదాలు తెలిపారు.

Kishan Reddy
కిషన్‌రెడ్డి

By

Published : Sep 5, 2021, 12:30 PM IST

హైదరాబాద్​లో ఎమ్మార్పీఎస్​ వ్యవస్థపక అధ్యక్షుడు మందకృష్ణను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. గత నెల దిల్లీలో స్నానాల గదిలో మందకృష్ణ జారిపడి గాయపడ్డారు. చికిత్స అనంతరం హైదరాబాద్​కు చేరుకున్నారు. ఆయన్ను కలిసి కిషన్​ రెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ పోరాడుతున్నారని అన్నారు. లక్ష్య సాధన కోసం మందకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. మందకృష్ణ త్వరగా కోలుకుని.. లక్ష్య సాధనలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఎస్సీ వర్గీకరణ విషయంలో చర్చించడం కోసం మందకృష్ణమాదిగ దిల్లీకి వచ్చారు. వారు వచ్చిన తర్వాత వారున్న నివాసంలో ఆయన కాలు జారిపడ్డారు. కూడి కాలు ఎముక ఫ్యాక్చర్​ అయింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స అనంతరం కృష్ణమాదిగ హైదరాబాద్​కు వచ్చారు. ఆయన్ను పరామర్శించడానికి వచ్చే నాయకులతో వర్గీకరణ విషయమే మాట్లాడేవారు.

-కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

కష్టాల్లో ఉన్న సమయంలో తనకు అండగా నిలిచిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి ఎమ్మార్పీఎస్​ వ్యవస్థపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య నాయుడు సహకారంతోనే నేను ఇంటికి చేరగలిగానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర న్యాయశాఖ, ప్రధాని , కేంద్ర పెద్దలతో చర్చించి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ప్రధాన దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని కేసీఆర్ చెప్పారని... ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లాలని కోరారు. వర్గీకరణ మందకృష్ణతో సాధ్యం కాదని.. తానే స్వయంగా సాధిస్తా అని కేసీఆర్ గతంలో పేర్కొన్నారని మందకృష్ణ గుర్తు చేశారు.

కేసీఆర్ నమ్మిన తర్వాత లాభం కంటే మాదిగలకు నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మాదిగ వ్యక్తిని తొలగించారు. ఇప్పుడు మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు. మాల సామాజిక వర్గం వారు మాకు సోదరులే. మాదిగలకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూ పంపిణీలా కాకుండా హుజూరాబాద్​లో ఇచ్చిన ఉపన్యాసానికి కట్టుబడి ఉండాలని కేసీఆర్​ను కోరుతున్నట్లు చెప్పారు. రెండేళ్లలోపు దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్నారు.

నా క్షేమం కోరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి కృషి చేయాలని కోరుతున్నా. వర్గీకరణపై సీఎం కేసీఆర్​ అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతోంది. మంత్రివర్గంలో మాదిగ లేడు. యూనివర్సిటీ వీసీగా మాదిగా లేడు. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​లో మాదిగ లేడు.

-మందకృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్​ వ్యవస్థపక అధ్యక్షుడు

Kishan Reddy: మందకృష్ణను పరామర్శించిన కిషన్‌రెడ్డి

ఇదీ చదవండి:Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు

ABOUT THE AUTHOR

...view details