Kishan reddy letter to CM KCR: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే రైల్వే ప్రాజెక్టుల్లో ఆలస్యం అవుతోందని.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల్లో కేంద్రం అన్యాయం చేస్తోందని తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలను కిషన్‌రెడ్డి ఖండించారు. విమర్శలు మానుకొని రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వ్యయం, భూకేటాయింపులు త్వరిగతిన పూర్తిచేయాలని చురకలంటించారు.
"రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం న్యాయం చేయడం లేదని తెరాస ప్రతినిధులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు చేసే ముందు రాష్ట్రానికి ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వ్యయాన్ని.. భూ కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలి." అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
తొమ్మిది రెట్లు నిధులు
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడేళ్లలో తెలంగాణకు తొమ్మిది రెట్లు నిధుల కేటాయింపు పెరిగిందని కిషన్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. 2014-15 బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 250 కోట్లున్న కేటాయింపులు 2021-22 నాటికి రూ. 2 వేల 420 కోట్లకు పెరిగాయని తెలిపారు. తెలంగాణలో ఏడేళ్లలో రైల్వే నెట్‌వర్క్ 194 రూట్ కిలోమీటర్లు అంటే 356 ట్రాక్ కిలోమీటర్లు పెరిగిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం ప్రకారం నిధుల వాటా సమకూరిస్తే రాష్ట్రంలో రైల్వేల పురోగతి మరింత ఎక్కువగా ఉండేదని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల వారీగా సమగ్ర వివరాలతో సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖను సంధించారు.
ఇదీ చదవండి:Bandi Sanjay on Teacher Posts: 'రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి'