అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాను దిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్‌పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలని చెప్పారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చేరుకుంది. అంబర్ పేట ప్రజలు తన ప్రాణమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంబర్‌పేట గురించి ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు. కేంద్ర మంత్రి అయినందుకు సంతోషం లేదని.. అంబర్‌పేటకు దూరమయ్యానని బాధ ఉందన్నారు. అంబర్‌పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తానని చెప్పారు.
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మీ అంబర్‌పేట బిడ్డ కృషి కూడా ఉందన్నారు. గోల్కొండ కోటను అభివృద్ధి చేస్తానని తెలిపారు. అంబర్‌పేట ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. పార్టీ, అంబర్‌పేట తనకు రెండు కళ్లతో సమానమని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ పరిపాలన పక్కన పెట్టి ఫామ్ హౌస్, ప్రగతి భవన్లో పడుకుంటున్నారని విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... కేసీఆర్ నియంత పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భాజపాను ఆశీర్వదించాలని కోరారు.