పోలవరం ప్రాజెక్టు వద్ద భాజపా కార్యకర్తలు నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఏపీ సీఎం భద్రత కారణంగా ప్రాజెక్టుకు దూరంగా భాజపా సభకు అనుమతి ఇచ్చారు. రెండేళ్ల క్రితం పోలవరం ప్రాజెక్టుకు వచ్చి ఉంటే ఇంకా వేగంగా పనులు పూర్తి అయ్యేవని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజకీయ పార్టీగా భాజపా ఉందని అన్నారు.
చాలా రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలోనూ ఇన్ని చోట్ల అధికారంలో లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో భాజపా చాలా బలపడాల్సి ఉందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. రెండుసార్లు పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రజలు అందించారని తెలిపారు. కరోనా వల్ల భారత్లో ఏం జరుగుతుందోనని చాలా దేశాలు భయపడ్డాయని, ఇండియాలోనూ ఆందోళన వ్యక్తం అయ్యిందన్నారు. అన్ని వైద్య సౌకర్యాలు ఉన్న అమెరికా, యూరప్ లాంటి దేశాలూ కరోనాతో వణికాయన్నారు. అన్ని దేశాల్లోనూ ఇబ్బందులు ఉంటే భారత్ దాన్ని దీటుగా ఎదుర్కొందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.