విభజన చట్టమే ఆధారం..
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి, వాటి ఉపనదుల నీటిని, వాటి ద్వారా అందే ఫలాలను న్యాయబద్ధంగా ఎలా పంపిణీచేయాలన్న అంశాల గురించి విభజన చట్టంలోని సెక్షన్ 84 నుంచి 91 వరకు చెబుతున్నాయి. విభజన చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే 2014లోనే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసింది. వాటి పరిధిని ఇప్పటివరకు నిర్దేశించలేదు. అయినా రెండు బోర్డులు పనిచేస్తూ వచ్చాయి. విభజన చట్టంలోని సెక్షన్ 84 అపెక్స్ కౌన్సిల్ గురించి చెబుతోంది. దానికి కేంద్ర జల్‌శక్తిమంత్రి ఛైర్మన్‌గా ఉంటే, ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. అన్ని వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం అపెక్స్ కౌన్సిల్ ఉద్దేశం. దీని మొదటి సమావేశం 2016 సెప్టెంబరులో జరిగింది. కానీ, ఆనాటి ఎజెండాలోని అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాలుగేళ్ల తర్వాత 2020 అక్టోబరు 6న రెండో సమావేశం జరిగింది. ఇందులో చాలా సరళమైన ఎజెండా పెట్టాం. రెండు నదీ యాజమాన్య బోర్డుల అధికార పరిధిని నిర్ధారించడం, రెండు రాష్ట్రాలు తమ పరిధిలో నిర్మించే కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందడం కోసం డీపీఆర్‌లను బోర్డులకు సమర్పించడం, రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి పంపిణీ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం, కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించడం ఆ ఎజెండాలోని అంశాలు. వాటిపై ఆ రోజు విస్తృతంగా చర్చలు జరిగాయి. సెక్షన్ 87 ప్రకారం ఈ రెండు బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని ఆ భేటీలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. దాని తర్వాత ఎంతో మథనం చేసి, లోతుగా సమాలోచనలు జరిపి ప్రతి పదం పరిశీలనగా చూసి అంతిమంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాం.
రెండో షెడ్యూల్ ప్రాజెక్టులపై పూర్తిగా బోర్డులదే నియంత్రణ..
ఈ నోటిఫికేషన్లలోని షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ, యాజమాన్యం బాధ్యతలను రెండు బోర్డులు చూసుకుంటాయి. విభజన చట్టంలోని నిబంధనలను అనుసరించి రెండు రాష్ట్రాలకు నీరు, విద్యుత్తు సరఫరాను ఈ బోర్డులే నియంత్రిస్తాయి. ఉమ్మడి ఏపీ విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలుచేయాలన్న కేంద్రం ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఈ నిబంధనలు విధించాం. అనుమతులు ఉన్న, అనుమతులులేని అన్ని ప్రాజెక్టులనూ ఇందులో చేర్చాం. బోర్డుల నిర్వహణకు అవసరమ్యే ఖర్చును రెండురాష్ట్రాలూ సమానంగా భరించాల్సి ఉంటుంది. అనుమతి లేని ప్రాజెక్టులు అంటే ఏమిటో మేం నిర్వచించాం. వాటిని ఈ గెజిట్‌లోని షెడ్యూళ్లలో చేర్చినంత మాత్రాన అనుమతులు వచ్చినట్లు భావించడానికి వీల్లేదు.
3 షెడ్యూళ్లుగా ప్రాజెక్టుల విభజన
కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించాం. రెండు రాష్ట్రాల్లో ఈ నదులు, ఉపనదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ మొదటి షెడ్యూల్‌లో చేర్చాం. షెడ్యూల్ 2లో పేర్కొన్న ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలకు 100% నియంత్రణ ఉంటుంది. కేంద్ర హోంశాఖతో సంప్రదించి వీటికి సీఐఎస్‌ఎఫ్ భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. షెడ్యూల్ 3లో పేర్కొన్న ప్రాజెక్టులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా నిర్వహిస్తున్నాయో అలాగే కొనసాగించవచ్చు. అయితే అందుకు సంబంధించిన నిర్దేశాలను మాత్రం రెండు బోర్డుల నుంచితీసుకోవాల్సి ఉంటుంది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులను షెడ్యూల్ 2లో చేర్చాం. వీటి నిర్వహణ సరిగా లేకపోతే 2రాష్ట్రాల్లో ఉన్న 8 కోట్లకుపైగా ప్రజలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇవి బహుళోపయోగ ప్రాజెక్టులు. వీటిలోంచి 80% నీటిని సాగు కోసం, మిగతా విద్యుత్తు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వాడుతుంటారు. అందువల్ల రోజువారీ విడుదల చేసే నీటిలో పైన పేర్కొన్న అంశాల్లో దేనికెంత అన్నది పర్యవేక్షిస్తూ, దాని ప్రకారం ఏపీ, తెలంగాణ అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. ఆ పని బోర్డులు చేస్తాయి.
ఈ కసరత్తుకు ఏడేళ్లు ఎందుకు పట్టింది?
నీటి పంపిణీ అన్నది అత్యంత సున్నితమైన అంశం. కేంద్రం ఈ అంశంలో న్యాయ నిర్ణేత పాత్ర పోషించాల్సి ఉంది. చూడటానికి ఏడేళ్ల సుదీర్ఘ సమయం పట్టినట్లు కనిపించినా, ఏకాభిప్రాయ సాధన కోసం భాగస్వామ్యపక్షాలన్నింటినీ ఒకచోటకి తెచ్చి, పరస్పరం మాట్లాడుకొనేలా చేసి 8 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం పరస్పర అంగీకారానికి వచ్చేలా చేయడానికి సమయం తీసుకోక తప్పలేదు. ట్రైబ్యునళ్లు ఇప్పటికే ఇరురాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేశాయి. ఆ నీటిని విభజిత రాష్ట్రాల మధ్య న్యాయబద్ధంగా పంచడంపై నిర్ణయానికి రావడానికి కొంత సమయం పట్టింది.