తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల 15 ప్రాజెక్టులపై ఆరా

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టుల పూర్తి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు నుంచి కేంద్రం తీసుకున్నట్లు తెలిసింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సూచన మేరకు 2 రాష్ట్రాలకు సంబంధించిన 15 ప్రాజెక్టుల వివరాలను బోర్డు అధికారులు పంపినట్లు సమాచారం.

central-irrigation-department-enquiry-on-telugu-states-controversy-projects
తెలుగు రాష్ట్రాల 15 ప్రాజెక్టులపై ఆరా

By

Published : Jun 7, 2020, 6:34 AM IST

Updated : Jun 7, 2020, 9:09 AM IST

తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టుల వివరాలను కేంద్రం తీసుకున్నట్లు తెలిసింది. ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టుల వారీగా ఎప్పుడు ప్రారంభించారు? ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? నీటి వినియోగం, ఆయకట్టు, నీటి లభ్యత ఎంత? ఇప్పటివరకు ఎంత ఖర్చుపెట్టారు, కొత్త ఆయకట్టు ఏమైనా అభివృద్ధి చేశారా, సమగ్ర ప్రాజెక్టు నివేదికను బోర్డుకు అందజేశారా? లేదా?, ఈ ప్రాజెక్టుల వల్ల వినియోగంలో ఉన్న వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది తదితర అంశాలపై నివేదిక తీసుకున్నట్లు తెలిసింది.

శ్రీశైలం నుంచి రోజూ మూడు టీఎంసీల నీటిని తీసుకునేలా ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయగా, తర్వాత తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు గోదావరి-పెన్నా, వేదవతి ఎత్తిపోతల, ముచ్చుమర్రి, గుండ్రేవుల, గురురాఘవేంద్ర, గాజులదిన్నె, పులికనుమ, సిద్దాపురం, నాగులదిన్నె, వైకుంఠపురం బ్యారేజి మొదలైన వాటిపై కూడా బోర్డుకు తెలంగాణ విన్నవించగా.. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, భక్తరామదాసు, తుమ్మిళ్లతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపును ఏపీ ప్రస్తావించింది. ఈ ఫిర్యాదులపై కేంద్రజల్‌శక్తి జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్నంగా చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని సూచించడంతో పాటు, అపెక్స్‌కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోవడంతో కేంద్రం మరింత జోక్యం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం కేంద్ర జల్‌శక్తి మంత్రి ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుల గురించి దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి:'ఎస్​ఈసీ పునర్నియామకం'పై.. ఈ నెల 10న సుప్రీంలో విచారణ

Last Updated : Jun 7, 2020, 9:09 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details