తెలంగాణ

telangana

ETV Bharat / city

Agnipath: సికింద్రాబాద్‌ విధ్వంసంసై నిఘా సంస్థల ఆరా

Agnipath News: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో కేంద్ర నిఘా సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విధ్వంసానికి నిర్దుష్ట కారణాలను తెలుసుకోవడంతో పాటు ఇందుకు బాధ్యులు, ఆందోళనలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు కేంద్ర నిఘా సంస్థతో పాటు రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి.

agnipath
agnipath

By

Published : Jun 20, 2022, 7:47 AM IST

Agnipath News: ‘అగ్నిపథ్‌’ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన విధ్వంసంపై కేంద్ర నిఘా సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పలువుర్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మిగతావారినీ గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో విధ్వంసానికి నిర్దుష్ట కారణాలను తెలుసుకోవడంతో పాటు ఇందుకు బాధ్యులు, ఆందోళనలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు కేంద్ర నిఘా సంస్థతో పాటు రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి.

ఈ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో వాటిపైనా కేంద్ర నిఘా సంస్థ ఆరా తీస్తోంది. పోలీసులు, రైల్వేశాఖ ప్రతినిధులు సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నిఘా విభాగానికి చెందిన ప్రతినిధులు దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. ఘటనలో జాతి వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందా? అన్న కోణంలో వారు ఆరా తీస్తున్నారు. విధ్వంసానికి పాల్పడ్డవారిని సైనిక దళాల్లో తీసుకోకూడదని అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వీరిని గుర్తించేందుకు అరెస్టయిన వారి వివరాలు, దర్యాప్తు సందర్భంగా వారు వెల్లడించిన అంశాలతోపాటు సీసీ కెమెరా దృశ్యాలు, వివిధ మీడియాల్లో ప్రచురితమైన ఫొటోలు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన దృశ్యాలను నిఘా విభాగం ప్రతినిధులు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details