TS Government on Polavaram Project: గోదావరి నది స్వరూపం మారడం, జరిగిన మార్పులు-చేర్పులు, ఇటీవలి వరదలు తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పోలవరం బ్యాక్ వాటర్స్‌పై స్వతంత్ర సంస్థచే సమగ్ర అధ్యయనం చేయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి వర్చువల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జలసౌధ నుంచి తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీలు, ఇంజినీర్లు సమావేశానికి హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపించిన అధికారులు.. 86 వరదలను ప్రామాణికంగా తీసుకోవడం తగదని, అప్పటి నుంచి గోదావరి నదికి సంబంధించి ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. 50 లక్షల పీఎంఫ్ ప్రాతిపదికన సమగ్ర అధ్యయనం చేయించాల్సిందేనని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నిల్వ చేస్తే భద్రాచలం పట్టణం, పరిసరాలకు ముప్పు ముంపు ఉందని.. కేవలం కాఫర్ డ్యామ్‌తోనే ఇటీవలి వరదల సమయంలో జరిగిన నష్టాన్ని ఒకసారి గమనించి భవిష్యత్ పరిస్థితులను అంచనా వేయాలని కోరారు. జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం జరుగుతున్న పోలవరం ప్రాజెక్టులో ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను నివృత్తి చేయకుండా, ఏమీ కాదంటూ ముందుకెళ్లడం సరికాదని తెలంగాణ అధికారులు అన్నారు. గోదావరి నదికి సంబంధించిన క్రాస్ సెక్షన్స్‌పైనా అధ్యయనం చేయాలని కోరారు. ఇటీవలి వరదల సందర్భంగా ఉత్పన్నమైన పరిస్థితులకు అనుగుణంగా వీలైనంత త్వరగా రక్షణ చర్యలు చేపట్టాలని, అందుకయ్యే వ్యయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీయే భరించాలని కోరారు. అటు ఒడిశా సైతం ప్రాజెక్టు ఎత్తు, ముంపు సమస్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అనుమతులు ఎలా ఇస్తారు..: ఎలాంటి పబ్లిక్ హియరింగ్ జరగకుండా జాతీయ ప్రాజెక్టు అయినంత మాత్రాన అనుమతులు ఎలా ఇస్తారని ఒడిశా అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. తమ భూభూగంలో నదికి ఇరువైపులా 30 కిలోమీటర్లు 15 మీటర్ల ఎత్తుతో రక్షణ కట్టల నిర్మాణం ఎలా సాధ్యమని.. అంత భూమిని ఎలా సేకరిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రభావ అంచనాపై అధ్యయనం లేకుండా ముందుకెళ్లడం తగదని అన్నట్లు సమాచారం. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రాల వాదనలు, అభిప్రాయాలు విన్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి.. వచ్చే నెల ఏడో తేదీన మరో సమావేశం నిర్వహిస్తామని, ఆయా రాష్ట్రాల సాంకేతిక బృందాలు వచ్చి అన్ని అంశాలను సమగ్రంగా వివరించాలని తెలిపారు.