ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీటింగ్ ద్వారా కరోనాను అరికడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. టిమ్స్‌లో వెయ్యిమందికి చికిత్స అందించేలా సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. తెలంగాణకు అన్ని రకాలుగా సహకరిస్తున్న కేంద్రం... రాష్ట్రానికి 1,200 వెంటిలేటర్లు పంపినట్టు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు పూర్తిస్థాయిలో పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రిలో కొవిడ్ పడకలు ఏర్పాటు చేయనున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు నెలంతా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. హైదరాబాద్‌లో పరీక్షల సంఖ్య తక్కువగా ఉందన్న ఆయన... అన్ని బస్తీల్లో పరీక్షలు చేయాలన్నారు. పరీక్షల సంఖ్య ఎంత పెంచితే... కరోనాను అంతగా అరికట్టవచ్చన్నారు. మాస్కులు లేకుండా బయటకు రావొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బయటకు రావొద్దని కోరారు.