ఏపీలో తిరుపతి వేదికగా నిర్వహించిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సదస్సు.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. జోనల్ మండలి భేటీలతో రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ భేటీతో 51 పెండింగ్ సమస్యలకు 40 పరిష్కారమైనట్లు ట్వీట్ చేశారు. ఈ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇంఛార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, అండమాన్ నికోబార్ ఎల్‌జీ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం... రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదన్నారు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదన్నారు. పోలవరం ఖర్చు నిర్ధరణలో 2013- 2014 ధరల సూచీతో ఏపీకి అన్యాయం జరుగుతోందని, పోలవరం ఖర్చుపై విభజన చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించి.. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోతలు విధించటం సరికాదన్నారు. రుణాలపై కోతల అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లేదని, సవరణలు చేయాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయ పడ్డారు.