Amit shah meeting: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై తెరాస తీవ్రస్థాయిలో చేస్తున్న ఆందోళనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. దీటుగా ఎదుర్కునేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షానే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు రాష్ట్ర ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేయటంతో పాటు.. స్వయంగా తానే తెలంగాణలో రెండు రోజులు పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
భాజపా రాష్ట్ర ముఖ్య నేతలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని అమిత్ షా ఛాంబర్‌లో నిర్వహించిన ఈ భేటీకి మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, డీకే అరుణతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితం సాధించారన్న అమిత్ షా.. ఈటల రాజేందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం.. తెరాసను ఎదుర్కొనే వ్యూహాలపై రాష్ట్ర ముఖ్య నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. భాజపాపై తెరాస చేసే ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ప్రజల మధ్య ఉండే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ధాన్యం విషయంలో తెరాస వైఖరిని బహిర్గతం చేయాలని మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. బండి సంజయ్‌తో ప్రత్యేకంగా 15 నిమిషాలు మాట్లాడిన అమిత్‌షా.. రెండు రోజుల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కేసీఆర్ అవినీతి చెప్పండి..
"కేసీఆర్ చేసే ప్రతీ ఆరోపణకు దీటుగా సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో బియ్యం కుంభకోణం, ఇతర అవినీతిని వెలికితీయాలి. కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరంగా చెప్పాలి. అవినీతిపై విచారణలకు డిమాండ్ చేయండి. కేసీఆర్ ఒకటి చేప్తే నాలుగువిధాలుగా మీరు సమాధానం చెప్పాలి. ఏ ఒక్క విషయంలోనూ వెనకడుగు వేయొద్దు. ప్రభుత్వాల మధ్య జరిగేది జరుగుతూ ఉంటుంది.పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధం లేదు. సంజయ్ పాదయాత్ర తరహాలో ఇతర కార్యక్రమాలు చేపట్టాలి." -అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి
ఇదీ చూడండి: