తెలంగాణ

telangana

ETV Bharat / city

THIRD WAVE: అత్యవసర నిధుల కింద రూ.456 కోట్లు కేటాయింపు - తెలంగాణ తాజా వార్తలు

కొవిడ్‌ మూడో దశను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల వైద్యానికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా పిల్లల ఐసీయూలను నెలకొల్పనుంది. రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అత్యవసర నిధులను మంజూరు చేసింది కేంద్రం. మొత్తం రూ.456 కోట్లను కేటాయించింది. 1,119 పీజీ మెడికల్‌ రెసిడెంట్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించింది.

THIRD WAVE
THIRD WAVE

By

Published : Aug 18, 2021, 6:55 AM IST

Updated : Aug 18, 2021, 8:29 AM IST

కొవిడ్‌ మూడో దశ(THIRD WAVE)ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల వైద్యానికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా పిల్లల ఐసీయూల(ICU)ను నెలకొల్పనుంది. దేశంలో మూడోదశ ముప్పు ఎప్పుడొచ్చినా పోరాడటానికి ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన(Infrastructure) కోసం అత్యవసర నిధులను మంజూరు చేసింది. మొత్తం రూ.456 కోట్లను కేటాయించింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 60% కాగా.. రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన కార్యక్రమాల కోసం మాత్రమే ఈ నిధులను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరించింది. రాష్ట్రంలో ఏయే కార్యక్రమాలను చేపట్టాలో వివరిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించింది. ఈ దిశగా రాష్ట్రం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే నిలోఫర్‌ ఆసుపత్రి(NILOUFER HOSPITAL)ని ప్రత్యేక ఆరోగ్య నిలయం(సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ)గా తీర్చిదిద్దడానికి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.

పిల్లలకు ఐసీయూలు

నిలోఫర్‌తో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కేంద్రం మౌలిక వసతుల కల్పన కోసం రూ.270 కోట్లు మంజూరు చేసింది. అన్ని ఆసుపత్రుల్లోనూ ఐసీయూ పడకలను పెంచాలనీ, వీటిలో 20% కచ్చితంగా పిల్లల కోసం కేటాయించాలని పేర్కొంది. కనీసం 27 ఆసుపత్రుల్లో 42 పడకల చొప్పున పిడియాట్రిక్‌ యూనిట్ల(Pediatric units)ను, 6 చోట్ల 32 పడకల చొప్పున పిల్లల వార్డులను నెలకొల్పాలని కేంద్రం సూచించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని వైద్యకళాశాలల్లో 825, జిల్లా ఆసుపత్రుల్లో 90 ఐసీయూ పడకలను చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించాలని స్పష్టం చేసింది.

తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు

మూడోదశ ఉద్ధృతిలో 1,119 పీజీ మెడికల్‌ రెసిడెంట్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.

"ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం విద్యార్థులను, జీఎన్‌ఎం నర్సింగ్‌, బీఎస్సీ నర్సింగ్‌ తుది సంవత్సరం విద్యార్థులనూ కొవిడ్‌ విధుల్లో వినియోగించుకోవచ్చు. మానవ వనరుల నియామకాలకు రూ.40 కోట్లు వెచ్చించవచ్చు. 451 ప్రత్యేక అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోవాలి. అన్ని ఆసుపత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొల్పాలి’’ అని స్పష్టంచేసింది.

కరోనా పరీక్షలు(COVID TESTS), కొవిడ్‌ ఔషధాలకు రూ.130.48 కోట్లు కేటాయించింది. 1.10 కోట్ల యాంటీజెన్‌ కిట్లు, 30.77 లక్షల ఆర్టీపీసీఆర్‌ కిట్లు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్‌(RTPCR) ప్రయోగశాలలనూ బలోపేతం చేసుకోవాలంది.

ఇవీ చూడండి: తెలంగాణ, ఏపీలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా

Last Updated : Aug 18, 2021, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details