పాడి రైతులకు తీపి కబురు. కొవిడ్ సంక్షోభం నుంచి పాడి పరిశ్రమను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా పాడి రైతులకు రుణాలివ్వడానికి రూ.15 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీని కింద సహకార డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు బ్యాంకు రుణాలివ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ)తో పాటు, కరీంనగర్ డెయిరీ, ముల్కనూర్, రంగారెడ్డి- నల్గొండ జిల్లాలకు చెందిన నార్ముల్ (మదర్) డెయిరీలకు నిత్యం పాలు విక్రయించే 2.50 లక్షల మంది రైతులకు ఈ ప్యాకేజీ వర్తిస్తుంది.
వ్యవసాయ రైతులకు బ్యాంకులు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)లను పాడి రైతులకూ ఇవ్వాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. ఈ కార్డు ఉన్న పాడి రైతుకు నేరుగా రూ.1.60 లక్షల రుణం వస్తుంది. ఇప్పటికే పాడి పశువులున్న రైతులు ఈ సొమ్ముతో ఇతర అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశముంది. ఇప్పటికే ఒకట్రెండు పశువులతో డెయిరీకి తక్కువగా పాలు పోసే రైతులు.. అదనంగా పాలు పోయడానికి ఆసక్తి కనబరిస్తే రూ.3 లక్షల వరకు రుణం అందుతుంది.