విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఏడాదిన్నరలోగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం దాన్ని సాకారం చేసుకొనేందుకు ‘విశాఖ ఉక్కు’ విక్రయ వ్యవహారాన్ని వేగంగా కదిపే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం ప్రారంభానికి తొలుత కేంద్ర ప్రభుత్వం లావాదేవీల, న్యాయ సలహాదారులను నియమిస్తుంది. తర్వాత కొనేందుకు ఆసక్తిగలవారిని ఆహ్వానిస్తూ ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ పిలుస్తారు. అర్హతలను ముందే నిర్దేశిస్తారు. అనుభవం, నెట్‌వర్త్, ఉక్కు తయారీ సామర్థ్యం, దేశీయ భాగస్వామ్యం లాంటి షరతులు పెడతారు. ఇందులో అర్హత సాధించిన వారికి ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ బిడ్డింగ్‌కు అనుమతిస్తారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని కొనేందుకు ఆర్థిక బిడ్ దాఖలుకు ఆ తర్వాత వీలు కల్పిస్తారు. ఎక్కువ మొత్తం కోట్ చేసినవారికి కర్మాగారం అప్పగిస్తారు.
బిడ్డింగ్ మొత్తాన్ని ఏకమొత్తంలో ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే.. సంస్థ విలువలో అప్పులు పోను మిగిలిన మొత్తం ఏకమొత్తంలో చెల్లించి, అప్పులను వాటి కాలపరిమితి ప్రకారం చెల్లించడానికి వీలుంటుంది. ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ సంస్థ విలువను లెక్కించలేదని తెలిసింది. ముందే కొంతమొత్తం అని చెబితే.. బిడ్డర్లు అంతకంటే కొంత ఎక్కువకు బిడ్లు దాఖలు చేయొచ్చని.. అందుకే దాని జోలికి పోలేదని అంటున్నారు. నిజానికి ఉక్కు కర్మాగారాన్ని షేర్‌మార్కెట్లో లిస్టింగ్ చేసి 10% వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించాలని తొలుత ప్రభుత్వం భావించిందని, కానీ తర్వాత సంస్థ నష్టాల్లో ఉండటంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థల షేర్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రంగంలో ఎఫ్‌డీఐలకున్న అనుమతులకు లోబడి విదేశీ సంస్థలకూ అవకాశం ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం కర్మాగారానికి ఉన్న మొత్తం భూమిని ఇవ్వరని.. ప్రస్తుత ఉత్పత్తికి, భవిష్యత్తు విస్తరణకు ఎంత కావాలో అంతవరకే ఇస్తారని పేర్కొన్నారు.