చైనాలోని వైద్య విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు భారతదేశంలో ‘హౌస్ సర్జన్ (హౌస్ సర్జెన్సీ)’ చేసేందుకు కేంద్రం నిరాకరించింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే ‘ఎఫ్‌ఎంజీఈ’ (ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) రాసే అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేసింది. కేంద్రం అర్ధంతరంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని వైద్య విశ్వవిద్యాలయాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల వారూ ఎంబీబీఎస్ చేస్తున్నారు.
ప్రతి ఏడాది సుమారు 4-5 వేల మంది అక్కడ ప్రవేశాలు పొందుతున్నారు. రష్యా, ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిఫైన్స్, ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు ఆరేళ్లు. చేరిన విద్యా సంస్థల్లోనే ఆరేళ్ల కోర్సు పూర్తి చేసిన అనంతరం కేంద్రం నిర్వహించే ‘ఎఫ్‌ఎంజీఈ’లో విద్యార్థులు అర్హత సాధించి ఏడాదిపాటు హౌస్‌సర్జన్ భారతదేశంలో చేయాలి. చైనాలోనూ ఎంబీబీఎస్ ఆరేళ్లు. అయితే తొలి అయిదేళ్లు పూర్తయిన తర్వాత చివరి ఏడాది హౌస్‌సర్జన్ ఇండియాలో చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇకపై ఆ వెసులుబాటు ఉండదు.