Central Minister Praises Fever Survey in Telangana :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. కరోనా పరిస్థితులపై మాండవీయ శుక్రవారం వివిధ రాష్ట్రాల్లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
Central Government Praises Fever Survey in Telangana :ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్ విభాగాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీశ్ ఇక్కడి కలెక్టరేట్ నుంచే కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి మాండవీయ కొనియాడారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కొవిడ్ రెండో దశ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘ఇటీవల చేపట్టిన మూడో దశ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 21,150 బృందాలు పాల్గొంటున్నాయి. ‘ఈ సర్వేలో ప్రత్యేక బృందాలు 77,33,427 ఇళ్లను పరిశీలించి కరోనా లక్షణాలున్న వారికి 3,45,951 కిట్లు అందించాయి. రెండో రౌండ్ సర్వే చేపడుతాం. కొవిడ్ పరీక్షలకు 2 కోట్ల కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. 86 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 27 వేల పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం, జ్వర సర్వేతో ప్రభుత్వ వైద్యాన్ని ఇంటి వద్దకే తీసుకెళ్లాం’’ అని వివరించారు.