రాష్ట్రానికి రూ.వేలకోట్ల రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయంటూ కేంద్ర బడ్జెట్లలో ఎప్పటికప్పుడు కొత్త ఆశలు కల్పిస్తున్న రైల్వేశాఖ సర్వేలతోనే సరిపెడుతోంది. ఆపై వాటిని పక్కన పెట్టేస్తోంది. సర్వేలకు సైతం రైల్వేబోర్డు కొర్రీలు వేస్తూ అలైన్‌మెంట్ మారుస్తుంటే.. జోన్ పరిధి ప్రయోజనాలపై దృష్టిపెట్టాల్సిన దక్షిణమధ్య రైల్వే అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రూ.ఏడువేల కోట్ల విలువైన ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్, పటాన్‌చెరు-ఆదిలాబాద్ రైలుమార్గాల ప్రతిపాదనల్ని రైల్వేశాఖ అటకెక్కించింది.
అదీ లేదు.. ఇదీ లేదు
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కి రోడ్డు మార్గంలో 300 కి.మీ. రైల్లో వెళితే 435 కి.మీ. ఏకంగా 9 గంటల ప్రయాణం. మహారాష్ట్రలోని ధర్మాబాద్, ముద్ఖేడ్ వరకు వెళ్లి.. తిరిగి వెనక్కి రావాలి. ఈ వ్యయప్రయాసల్లేకుండా పటాన్‌చెరు-ఆదిలాబాద్(జాతీయ రహదారి మార్గంలో) మధ్య కొత్త మార్గం సర్వేకు 2017లో రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. రూ.4,109 కోట్ల ఖర్చవుతుందని అంచనా కట్టింది. నాలుగేళ్లయినా కదలికే లేదు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అనేక ప్రాంతాలకూ రైలుమార్గం లేదు. వీటిని కలుపుతూ జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ వరకు నిర్మల్ మీదుగా కొత్తలైను సర్వేకు 2008-09లో రైల్వేశాఖ తలూపింది. 136 కి.మీ. దూరం.. దాదాపు రూ.700 కోట్ల ఖర్చవుతుందని 2010లో అంచనా వేశారు. తర్వాత దాని ఊసే లేదు. 2017 బడ్జెట్‌లో ఇదే లైనును రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం పేరుతో మరోసారి మంజూరుచేశారు. తొమ్మిదేళ్ల ఆలస్య ఫలితం.. అంచనా వ్యయం ఏకంగా రూ.2,720 కోట్లకు పెరిగింది. ఇదైనా ముందుకు సాగిందా.. అంటే అదీ లేదు.