Double Bed Room Houses: తెలంగాణలో పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో కేంద్ర నిధుల వాటా డబ్బుల విడుదలకు లబ్ధిదారుల జాబితాతో కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టింది. రెండో విడతగా కేంద్రం నుంచి రూ.723 కోట్ల నిధులు రావాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితా ఇచ్చేందుకు మూడు నెలల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కోరగా, కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఈ మొత్తం విడుదలకు ఇళ్ల పంపిణీ తర్వాతే మార్గం సుగమం అయ్యే పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్బన్, గ్రామీణ్ పథకాల కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లు మంజూరు చేస్తోంది. నిర్మాణవ్యయం హైదరాబాద్‌లో రూ.7 లక్షలు, పట్టణాల్లో రూ.5.70లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు అవుతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు రూ.72వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తోంది.
పంపిణీ ఆలస్యమే..రెండు పడక గదుల ఇళ్లు 2.91 లక్షలు మంజూరు కాగా, నిర్మాణం పూర్తయినవి.. ఇంకా చిన్నచిన్న పనులు చేయాల్సినవి కలిపి 1.82 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్ల సంఖ్య 17వేలు మాత్రమే. పూర్తయిన ఇళ్ల పంపిణీ 2, 3 నెలల్లో జరిగే అవకాశం ఉంది.