తెలంగాణ

telangana

ETV Bharat / city

'సాధారణ బియ్యం ఎంతైనా తీసుకుంటాం' - central govt green signal to normal rice procurement

Rabi Paddy Procurement : యాసంగి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. యాసంగిలో ఉప్పుడు కాకుండా సాధారణ బియ్యం ఎంత మొత్తంలో అయినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రం నుంచి 40.20 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర సర్కార్​ సోమవారం రాష్ట్ర అధికారులకు లేఖ పంపింది.

Rabi Paddy Procurement
Rabi Paddy Procurement

By

Published : Apr 19, 2022, 7:45 AM IST

Rabi Paddy Procurement : తెలంగాణ ఇస్తామన్న 40.20లక్షల మెట్రిక్‌ టన్నుల సాధారణ బియ్యాన్ని తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో యాసంగి ధాన్యం వ్యవహారం కొలిక్కి వచ్చినట్లయింది. యాసంగిలో ఉప్పుడు కాకుండా సాధారణ బియ్యం ఎంత మొత్తంలో ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం కొద్ది రోజుల కిందట స్పష్టం చేసింది. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వాటిలో నుంచి 40.20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం వస్తాయని పౌరసరఫరాల శాఖ నిర్ధారించింది. వాటిని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది. పోషకాలతో కూడిన ఉప్పుడు బియ్యం ఎంత కోరితే అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లూ ఆ లేఖలో స్పష్టం చేసింది.

Yasangi Paddy Procurement : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన 40.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సాధారణ బియ్యం తీసుకునేందుకు సిద్ధమేనంటూ కేంద్రం సోమవారం అధికారులకు లేఖ పంపింది. సాధారణ బియ్యంతోపాటు పోషకాలను కలిపి సాధారణ బియ్యం ఇచ్చినా తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి బియ్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో పూర్తవుతాయని సమాచారం. ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేందుకు మూడు నెలలు వ్యవధి అని.. అప్పటిలోగా బియ్యం ఇవ్వాలని లేఖలో కేంద్రం పేర్కొంది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైన నేపథ్యంలో సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయిలో బియ్యం ఇచ్చేందుకు అవకాశాలు తక్కువగానే ఉంటాయన్నది సమాచారం. గడువును నిర్దేశించినప్పటికీ స్థానిక పరిస్థితుల ఆధారంగా కేంద్రం పొడిగిస్తూనే ఉంటుంది.

నూకలపై త్వరలో కమిటీ భేటీ : యాసంగిలో ఉప్పుడు బియ్యం కాకుండా సాధారణ బియ్యంగా ధాన్యాన్ని మార్చే క్రమంలో నూకలు ఎక్కువగా వస్తాయి. దాన్ని కేంద్రం అనుమతించదు. ఆ నూకల నష్టాన్ని భరించేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకొచ్చింది. ఎంత మొత్తంలో నూకలొస్తాయి? పరిహారంగా మిల్లర్లకు ఎంత మొత్తం ఇవ్వాలి? తదితర సమాచారాన్ని నిర్ధారించేందుకు ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఆ కమిటీ భేటీ కానుంది. ప్రయోగాత్మకంగా ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మిల్లింగ్‌ చేయించి నూకలు ఎంత మొత్తంలో వస్తాయో పరిశీలించిన నష్టపరిహారాన్ని ఖరారు చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details