తెలంగాణ ఏర్పడ్డాక గత ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రూ.1,58,735 కోట్ల నిధులు విడుదలయ్యాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. పద్నాలుగో ఆర్థికసంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక గత అయిదేళ్లలో రూ.1,41,735 కోట్లు ఇచ్చామని చెప్పారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదు
‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకర స్థితిలో ఉందా? ఉంటే ఆ వివరాలేంటి? దానిపై కేంద్రం ఎలా స్పందిస్తోంది? గత ఆరేళ్లలో రాష్ట్రానికి ఏ పద్దు కింద ఎంత నిధులు విడుదల చేశారు? రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అదనపు నిధులూ విడుదల చేయలేదన్నది నిజమా?’ అన్న ప్రశ్నలకు నిర్మలాసీతారామన్ సమాధానమిచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదని స్పష్టంచేశారు. ‘
అందులో నిజం లేదు
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతుల ప్రకారం 2014-15 నుంచీ రాష్ట్రం రెవెన్యూ మిగులులోనే ఉందని తెలిపారు. రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి (2014-15 నుంచి 2019-20 వరకు బడ్జెట్ అంచనాల ప్రకారం) పెరుగుతున్నప్పటికీ అది 14వ ఆర్థికసంఘం నిర్దేశించిన పరిమితులు, రాష్ట్ర ప్రభుత్వ మధ్యంతర ఆర్థిక విధాన ప్రకటన ప్రకారమే ఉందిని పేర్కొన్నారు. తెలంగాణకు ఎలాంటి అదనపు నిధులూ విడుదల చేయలేదనడం నిజం కాదన్నారు.