అన్ని జిల్లా ఆసుపత్రులకు అనుబంధంగా వైద్య కళాశాలలను నెలకొల్పాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీటి నిర్వహణకు ప్రైవేటు ఆసుపత్రులు ముందుకొస్తే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో బోధనాసుపత్రులను ఏర్పాటుచేయడానికి ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలిపింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా జిల్లా, డివిజన్ కేంద్రాల్లోనూ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులను స్థాపించేలా ప్రైవేటు వైద్యరంగాన్ని ప్రోత్సహించాలని తీర్మానించినట్టు పేర్కొంది. 2021-22లో ఆరోగ్యరంగ అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక, గత పదేళ్లలో సాధించిన విజయాలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది.
జిల్లాల్లో క్రిటికల్ కేర్ యూనిట్లు
ఇక నుంచి ప్రతి పీజీ వైద్యవిద్యార్థి తప్పనిసరిగా మూడు నెలలపాటు జిల్లా ఆసుపత్రిలో శిక్షణ పొందాలనే నూతన విధానాన్ని అమలుల్లోకి తీసుకొస్తున్నట్టు కేంద్రం నివేదికలో పేర్కొంది. డీఎన్‌బీ కోర్సుల్లో భాగంగా ఎనిమిది స్పెషాలిటీ విభాగాల్లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ క్రిటికల్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో ఈ తరహా యూనిట్లు సుమారు 20 వరకూ ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
అన్ని జిల్లాల్లో ప్రజారోగ్య ప్రయోగశాలలు
గత పదేళ్లలో కొత్తగా ప్రబలిన వ్యాధుల్లో దాదాపు 75 శాతం జంతువులు లేదా వాటి ఉత్పత్తుల ద్వా రా వ్యాప్తిచెందాయని, 2020 సంవత్సరంలోనే ప్ర పంచ వ్యాప్తంగా కరోనా సహా 60కి పైగా అంటువ్యాధులు దాడిచేశాయని నిర్ధారణకు వచ్చారు. ఐసీఎంఆర్ పరిశోధనల్లోనూ గత ఆరేళ్లలో 1,240 రకాల వ్యాధులు పుట్టుకొచ్చినట్లుగా గుర్తించారు. వీటన్నింటి దృష్ట్యా అంటువ్యాధుల నివారణ లక్ష్యంగా దేశంలోని అన్ని జిల్లాల్లో సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణకు ఇప్పటికే జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రం మంజూరైంది.
1.5 లక్షలకు పెరగనున్న వెల్‌నెస్ సెంటర్లు
సమగ్ర వైద్యఆరోగ్య పథకం కింద ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 59,829 వెల్‌నెస్ సెంటర్లను నెలకొల్పారు. 2022 డిసెంబరు నాటికి వీటి సంఖ్య 1.5 లక్షలకు పెంచాలనేది లక్ష్యం. వీటిల్లో 12 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, సరైన ఆహారం(ఈట్ రైట్), శారీరక దృఢత్వం(ఫిట్ ఇండియా), యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
100 జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు
భారతీయ సంప్రదాయ వైద్యానికి అంతర్జాతీయ స్థాయిని కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పుతారు. దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్ హెల్త్ వెల్‌నెస్ సెంటర్లను, 100 జిల్లాల్లో ఆయుష్ జిల్లా ఆసుపత్రులను స్థాపిస్తారు. దేశవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో అత్యంత విలువైన ఔషధ మొక్కల సాగు చేపడతారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు సమకూరుస్తారు. ఆ దిశగా హెర్బల్ పంటల సాగును పెంచాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
క్షయ నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్షయ కేసుల అంచనా, గుర్తించడంలో మధ్య వ్యత్యాసం 2017లో 10 లక్షలుండగా, 2019లో దాన్ని 2.9 లక్షలకు తగ్గించినట్టు తెలిపింది.