Secunderabad Fire Accident : సికింద్రాబాద్ మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిహారం
08:40 September 13
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం
Exgratia for Secunderabad Fire Accident deceased : సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంపై ఇరువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్ర సర్కార్ మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు.
Secunderabad Fire Accident : సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో గతరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు సోమవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఘటన విషయం తెలుసుకుని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే సాయన్న చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇవాళ ఉదయం హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు యాక్టివేట్ అయ్యే స్ప్రింకర్లు ఉన్నాయని అవి కేవలం మంటలు చెలరేగినప్పుడే ఆన్ అవుతాయని.. నిన్నటి ఘటనలో దట్టమైన పొగ అలుముకోవడం వల్లే మరణాలు సంభవించాయని అధికారులు మంత్రికి వివరించారు.