Science City in Hyderabad : తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవకాశం తలుపు తట్టింది. హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటు ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది. శాస్త్ర, సాంకేతిక రంగాలపై యువతకు అభిరుచిని కలిగించి.. పరిశోధనలపై ఆసక్తిని పెంచుతుంది సైన్స్ సిటీ. దేశవిదేశాల నుంచి పరిశోధకులను, శాస్త్రవేత్తలను ఆకర్షించే శాస్త్రనగరి అది. కేంద్ర సాంకేతిక, పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సైన్స్ మ్యూజియాల జాతీయ మండలి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్) దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పలు నగరాల్లో సైన్స్ సిటీలు, సైన్స్ సెంటర్‌లు, ఇన్నోవేషన్ హబ్‌లు, డిజిటల్ ప్లానెటోరియాలను ఏర్పాటు చేస్తుంటుంది.
Science City in Telangana : తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి లేఖ రాశారు. దాంతో పాటు సైన్స్ సిటీ ఏర్పాటుకు మార్గదర్శకాలు, నిర్వహణ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం తదితర వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. రాష్ట్ర యువతకు, శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచి, విద్యార్థుల అభిరుచులకు తగిన అవకాశాలు కల్పించడానికి ఇది మార్గదర్శకం అవుతుందన్నారు. ఇందులో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్ ఎగ్జిబిషన్ హాళ్లు, డిజిటల్ థియేటర్‌లు, త్రీడీ షోలు, స్పేస్ సైన్స్ ఎగ్జిబిషన్ కేంద్రాలు, ప్రదర్శన శాలలు, అవుట్ డోర్ సైన్స్ పార్కు, ఆడిటోరియం, వర్క్‌షాపులు ఏర్పాటవుతాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంల మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను పంపితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర సంయుక్త నిధులతో..
- Hyderabad Science City :సాధారణంగా రాష్ట్ర రాజధానుల్లో సైన్స్ సిటీలను ఏర్పాటు చేస్తారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సైన్స్ సిటీ ఏర్పాటవుతుంది.
- 25 నుంచి 30 ఎకరాల స్థలం అవసరం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి.
- మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 232.70 కోట్లు. ఇందులో పెట్టుబడి వ్యయం రూ. 179 కోట్లు కాగా కార్పస్‌ఫండ్ 53.7 కోట్లు.
- ఈ నిధుల్లో కేంద్రం ప్రభుత్వం వాటా 60 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం.
సైన్స్ సిటీ వల్ల ప్రయోజనాలివి
- శాస్త్ర, సాంకేతిక రంగాలపై యువతకు అభిరుచిని, ఆసక్తిని పెంచడం
- ఇంజినీరింగ్, గణితం, పరిశోధనలపై అవగాహన కల్పించడం
- ప్రత్యేక పర్యాటక కేంద్రంగా గుర్తింపు
- సామాన్య ప్రజలు, విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేలా ప్రదర్శనలు, చర్చలు, శిబిరాల నిర్వహణ, ప్రముఖులతో ప్రసంగాలు.
- పాఠశాలలు, కళాశాలల వెలుపల సైన్స్ కార్యక్రమాల నిర్వహణ
- కొత్త పరికరాల తయారీ సహా వివిధ అంశాలపై అవగాహన పెంచడం
- సైన్స్ టీచర్లు, విద్యార్థులు, ఎంటర్‌ప్రెన్యూర్‌లు, సహా వివిధ వర్గాలకు ప్రత్యేక శిక్షణ
నిర్వహణ ఇలా
Telangana Science City : ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సొసైటీ ద్వారా సైన్స్‌సిటీని నిర్వహిస్తారు.
సామాజిక బాధ్యత నిధులు, కార్పస్ ఫండ్, కార్యక్రమాల ద్వారా నిధులు సమకూరుతాయి.