Hyderabad-Bangalore Road Expansion : హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అలైన్‌మెంట్ ఖరారు కోసం కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు సూచించింది. ఆ మేరకు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భౌగోళిక సర్వే చేపట్టారు.
తెలంగాణ నుంచి కర్ణాటకకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారి నాలుగు వరుసలుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రహదారికి రెండు వైపులా ఒక్కో వరుస చొప్పున పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 576 కిలోమీటర్ల మార్గాన్ని రెండు భాగాలుగా విస్తరించనున్నారు.
తెలంగాణ పరిధిలో ఈ రహదారి హైదరాబాద్ నుంచి అలంపూర్ చౌరస్తా (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) వరకు 210 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి అలంపూర్ చౌరస్తా వరకు తెలంగాణ అధికారులు, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఏపీ అధికారులు విస్తరణ పనులు చేపడతారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం వేర్వేరుగా నిధులను మంజూరు చేస్తుంది. పనులు మాత్రం ఒకే దఫా చేపడతారు.