Budget Impact On Ap: కేంద్ర ప్రభుత్వం ఏపీకి మళ్లీ టోపీ పెట్టింది. ఈసారి బడ్జెట్లోనూ దగా చేసింది. ఆర్థికలోటుతో కునారిల్లుతున్న రాష్ట్రంపై మరోసారి అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర విభజన గాయాల నుంచి కోలుకోలేక ఆర్థిక లోటులో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌పై... కేంద్రం కనీస కనికరం కూడా చూపలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మాట మాత్రంగానైనా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రాలేదు. ప్రత్యేక హోదా, రామాయపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం ఇలా విభజన హామీల్లో ఏ ఒక్కటీ ప్రకటించలేదు. పోనీ... ప్రత్యేక కేటాయింపులేమైనా చేశారేమోనని బడ్జెట్ పత్రాలన్నీ వెతికితే అరకొర కేటాయింపులు, మొక్కుబడి విదిలింపులూ తప్ప... ఒరిగిందేమీ లేదు. గతేడాది బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా కేటాయించిన కొత్త ప్రాజెక్టు ప్రస్తావనా..లేదు.
పొరపాటున కూడా...
గత బడ్జెట్ ప్రసంగంలో ఖరగ్‌పూర్-విజయవాడ, ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు రవాణా కారిడార్లు, చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టుల్ని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అవి ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తాయి కాబట్టి ఏపీ గురించి ప్రస్తావించారు. ఈసారి కనీసం అలాంటి ప్రాజెక్టుకూ నోచుకోలేదు. గత బడ్జెట్లో ప్రకటించిన రెండు రైలు రవాణా కారిడార్ల పనులు ఇంకా పట్టాలెక్కలేదు. చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టులో మాత్రం కొంత కదలిక ఉంది. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల గురించిగానీ, ఏపీలోని విమానాశ్రయాలకు.. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకుంటామనిగానీ... పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రాజెక్టుల్ని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటామని గానీ.. పొరపాటున కూడా బడ్జెట్ ప్రసంగంలో వినిపించలేదు.
కేంద్రం నిర్లక్ష్యంతో వెనుకబడిన నవ్యాంధ్ర..
ఇంకో రెండేళ్లు గడిస్తే... ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతుంది. ఒక రాష్ట్రం అభివృద్ధి ప్రస్థానంలో పదేళ్లంటే తక్కువ సమయమేమీ కాదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఆర్థికంగా అండంగా నిలిచే పెద్ద నగరాలేమీ లేక, రాజధాని అమరావతి నిర్మాణం కూడా నిలిచిపోవడంతో ఇప్పటికే బాగా వెనుకబడిన నవ్యాంధ్ర.. కేంద్రం నిర్లక్ష్యంతో వల్ల ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే రోజు రోజుకీ మరింత వెనకబడుతోంది. ప్రత్యేక హోదా కల్గిన ఈశాన్య రాష్ట్రాలకు, వెనుకబడిన రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహ కేటగిరీ కింద... కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని పరిశ్రమలకు తిరిగి చెల్లించేందుకు 2022-23 బడ్జెట్లో 3వేల 631 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇతర రాయితీల కిందా పలు కేటాయింపులు జరిపింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీకి కూడా అలాంటి ప్రోత్సాహకాల్లో కొన్నయినా వచ్చేవి. ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధుల గురించీ.. బడ్జెట్లో ప్రస్తావించలేదు.