తెలంగాణ

telangana

ETV Bharat / city

'రైతు సమన్వయ సమితుల ఏర్పాటును అభినందించిన కేంద్రం' - రైతు బంధును అభినందించిన కేంద్రం

central appreciate rythu bandhu scheme in telangana
'రైతు సమన్వయ సమితుల ఏర్పాటును అభినందించిన కేంద్రం'

By

Published : Aug 27, 2020, 3:44 PM IST

Updated : Aug 27, 2020, 7:02 PM IST

15:42 August 27

'రైతు సమన్వయ సమితుల ఏర్పాటును అభినందించిన కేంద్రం'

    తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది.  

కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ స్కీమ్‌పై అభిప్రాయాల సేకరణలో భాగంగా వివిధ రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ మంత్రులతో నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్.. దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజెంటేషన్​ ఇచ్చారు. ఇందులో రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బంధు సమితుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  

ఎన్నో పథకాలు విజయవంతంగా..

  రైతుబంధు పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పడం సహా.. తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా అమలు చేస్తున్నారని కితాబిచ్చారు. రైతులను సంఘటితం చేయడానికి ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిందని, ఫలితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మర్ నెట్​వర్క్ విస్తరించిందన్నారు. ఇలాంటి వ్యవస్థల ద్వారా అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ లాంటి పథకాలను సమర్థంగా అమలుచేయవచ్చని కేంద్ర వ్యవసాయశాఖ అధికారిక ప్రజంటేషన్​లో ప్రస్తావించారు.  

స్వాగతిస్తున్నాం..

కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయంలోనే.. నాబార్డు ఛైర్మన్​తో ముందుగా నిర్ణయించిన సమావేశం ఉండడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రం తరఫున పలు సూచనలు చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ స్కీమ్​ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాభివృద్ధికి, వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు రావడానికి ఈ పథకం తప్పక దోహదపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి వడ్డీ భారం లేకుండా చూడాలని ప్రతిపాదించారు.

58 లక్షల మంది రైతులకు సాయం..

తెలంగాణలో వ్యవసాయ రంగాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తోందని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. ప్రతి పంటకు.. రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు రూ.7వేల కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు తెలిపారు.  

రైతు బంధు సమితులపై..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతుబంధు సమితులను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఐదువేల ఎకరాలను ఒక క్లస్టర్​గా ఏర్పాటుచేసి.. వ్యవసాయ విస్తరణాధికారిని నియమించినట్లు మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు.  

ఎరువులపై..

తెలంగాణకు ఇవ్వాల్సిన ఎరువులను.. ముఖ్యంగా యూరియాను త్వరగా రాష్ట్రానికి పంపాలని కేంద్ర మంత్రిని నిరంజన్​రెడ్డి కోరారు.  

ఆ విషయంలో స్పష్టత కావాలి..

వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో సంస్కరణలు తీసుకొస్తామని కేంద్రం ప్రకటించిందని.. అవి ఎలా ఉంటాయనే విషయంలో స్పష్టత కావాలని కోరారు. కేంద్రం సంస్కరణలు తీసుకొస్తే.. ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి, పథకాలు ఎలా కొనసాగించాలనే విషయంలోనూ స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.  

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్​రెడ్డి.. వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.  

ఇవీచూడండి:నవంబర్ 15 నుంచి రామగుండంలో 'కిసాన్ బ్రాండ్' యూరియా

Last Updated : Aug 27, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details