రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేసులు ఏమైనా వస్తున్నాయా? తీవ్రత ఏమైనా ఉందా? మండలి ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి? తదితర అంశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందన్న అంశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీ కాలం ఈ ఏడాది జూన్ మూడో తేదీతో ముగిసింది. సాధారణంగా సభ్యుల పదవీ కాలం ముగియటానికి ముందుగానే ఎన్నికలు నిర్వహించటం ఎన్నికల సంఘానికి ఆనవాయితీ. కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో ఉండటంతో మండలి స్థానాల ఖాళీల భర్తీ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. పలు రాష్ట్రాల్లో పరిస్థితులు కుదుటపడటంతో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.