నేరస్థుల వినూత్న వ్యూహాలను కూడా ఎప్పటికప్పుడు ఛేదించేలా వివిధ రాష్ట్రాల పోలీసులు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో కూడిన అధునాతన సీసీ కెమెరాలను సమకూర్చుకుంటున్నారు. నేరగాళ్లు వాటికంట్లో పడ్డారో... వెంటనే అవి పోలీసులకు సమాచారం ఇస్తాయి. కోపం, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలను గుర్తించి స్పందించే వాటినీ కొన్ని రాష్ట్రాల యంత్రాంగం వినియోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక సాఫ్ట్వేర్ కలిగిన కంటి అద్దాలను వినియోగించే దిశగా కసరత్తు చేస్తున్నారు. పరిమిత పోలీసు వనరులు ఉన్న పరిస్థితుల్లో ఆధునిక త్రినేత్రాలు నేరనియంత్రణలో ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కొద్ది నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తి సికింద్రాబాద్ తపాలా కార్యాలయం నుంచి 62 పార్శిళ్లు బుక్ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సహా పోలీస్ అధికారులు, ప్రముఖ సినీ నటుల చిరునామాలను వాటిపై రాశారు. అక్కడి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని గుర్తించేందుకు నగరంలోని కృత్రిమమేధతో కూడిన సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు. అనుమానమున్న ఆటోలు, కార్లు, వ్యాన్ల నంబర్లను శోధించారు. ప్యాట్నీ క్రాస్‌రోడ్ వద్ద ఓ ఆటోలో నిందితుడు పోస్టాఫీస్ వద్దకు వచ్చినట్టు గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడి చిరునామా తెలుసుకుని 48 గంటల్లోనే అతడిని అరెస్టు చేశారు.
*సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి సోదరుడు టి.ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాల దోపిడీ కేసునూ తెలంగాణ పోలీసులు ఇలాగే ఛేదించారు. ఆటోమేటిక్ నంబరు ప్లేట్ రీడింగ్(ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ సాయంతో సగం మాత్రమే కన్పిస్తున్న కారు నంబరు ఆధారంగా దిల్లీలో ఉంటున్న ఘరానా నిందితుడిని పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కళ్లద్దాలతో కట్టడి!
ఆంధ్రప్రదేశ్ పోలీసులు కృష్ణా, అనంతపురం, కడప జిల్లాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. వీటికి అదనంగా కృత్రిమ మేధతో కూడిన కంటి అద్దాలను సమకూర్చుకోబోతున్నారు. వీటికున్న సాఫ్ట్‌వేర్‌లో పాత నేరస్థులు, దొంగలు సహా సంఘ విద్రోహశక్తులకు సంబంధించిన 10 లక్షల ముఖాలను నమోదు చేయవచ్చు. ఆ వ్యక్తులు మారువేషాల్లో ఉన్నా గుర్తించడం వీటి ప్రత్యేకత. ఇవి సెకనుకు పదిహేను ముఖాలను గుర్తిస్తాయి. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ అద్దాలను తయారు చేస్తున్న ఓ ప్రముఖ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రెండు, మూడు నెలల్లో వీటిని కొనుగోలు చేయనున్నారు.
ముఖంలో భయం, ఆందోళన కనిపిస్తే పోలీసులొస్తారు
ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ నగరంలో మహిళలు, యువతులను వేధించే పోకిరీల ఆటకట్టించేందుకు పోలీసులు భావోద్వేగాలను గుర్తించే సాంకేతికతతో కూడిన కెమెరాలను వినియోగిస్తున్నారు. వేధింపులు ఎక్కువగా జరుగుతున్న 200 ప్రాంతాల్లో వాటిని రహస్యంగా అమర్చారు. వేధింపులకు గురయ్యే బాధితుల ముఖాల్లో సహజంగానే భయం, బాధ, ఆందోళన కన్పిస్తాయి. ఈ కెమెరాలు ఆయా భావోద్వేగాలను గుర్తించి సంబంధిత ఠాణాకు సమాచారం ఇస్తాయి. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా, అవిచ్చే సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆకతాయిల ఆటకట్టిస్తారన్న మాట. గత నెల 20న వీటిని అమర్చగా, తర్వాత పది రోజుల్లోనే 400 మంది పోకిరీలకు అరదండాలు వేయగలిగారు.