Telugu Akademi FD Case: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో.. నిందితులకు పోలీసు కస్టడీ ముగియడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు సాయికుమార్ సహా ఆరుగురిని.. న్యాయస్థానం అనుమతితో రెండు రోజుల పాటు విచారించారు. కేసులో ప్రధాన సూత్రధారి సాయికుమార్.. తాను ఆస్తులు కొనలేదని, ఇంకా అప్పులున్నాయని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు ఇస్తానంటే ముంబయిలోని ఓ చమురు సంస్థ ఏజెంట్‌కు.. రూ. 5 కోట్లు ఇచ్చినట్టు తెలిపాడు.
డాక్టర్ వెంకట్, సోమశేఖర్, తెలుగు అకాడమీ ఏవో రమేష్‌లను.. విచారించిన సీసీఎస్ పోలీసులు.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా... మరో 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సాయికుమార్‌కు ఈ వ్యవహారంలో సహకరించిన... మరో ముగ్గురికి పోలీసులు తాఖీదులు జారీ చేశారు. కొల్లగొట్టిన సొమ్మును మరింత స్వాధీనం చేసుకునేందుకు... ఇంకొందరిని విచారించనున్నారు. పోలీసులు గుర్తించిన ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా... న్యాయస్థానాన్ని అభ్యర్థించేందుకు ప్రభుత్వం నుంచి లేఖ రాయించనున్నారు.
దొంగదారిన విత్ డ్రా..
Telugu Akademi deposits case : బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తెలుగు అకాడమీ డిపాజిట్లను దొంగదారిన విత్ డ్రా చేసుకున్న నిందితులు ఆ డబ్బును పప్పు, బెల్లాల్లా పంచుకున్నారు. యూబీఐ కార్వాన్, సంతోష్ నగర్ ఖాతాల్లో రూ.54.5 కోట్లు.. చందానగర్‌లోని కెనరా బ్యాంకులో ఉన్న రూ.10 కోట్లను కొల్లగొట్టిన ముఠా సభ్యులు మొత్తం రూ.64.5 కోట్లు వాటాలుగా పంచుకున్నారు. ఇందులో అధిక వాటా తీసుకున్న వెంకటసాయి కుమార్ హైదరాబాద్ బాహ్యవలయ రహదారికి పక్కన 35 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. దుబాయి నుంచి తక్కువ ధరకు డీజిల్ వచ్చేలా ఏజెన్సీ ఇప్పిస్తానంటే ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు సీసీఎస్ పోలీసులకు తెలిపారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీకి వచ్చిన రూ.2.5 కోట్ల డబ్బులతో ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన కూడా 2 కోట్ల రూపాయలు తీసుకొని ఫ్లాట్లు కొనుగోలు చేసింది. కొంత నగదు ఉందని దాన్ని వెనక్కి తిరిగిచ్చేస్తామని పోలీసులకు తెలిపారు. మరో నిందితుడు వెంకటేశ్వర్ రావు రూ.3 కోట్లు తీసుకొని సత్తుపల్లిలో బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ శాఖల్లోని డబ్బులను డిపాజిట్ల పేరుతో కొల్లగొట్టేందుకు కృష్ణారెడ్డి, సాయికుమార్ కలిసి ముఠా ఏర్పాటు చేసి కథ నడిపించినట్లు పోలీసులు తేల్చారు.
ఇదీచూడండి:Telugu Akademi Case Update: తొలిసారిగా ఏసీబీ సవరణ చట్టం వర్తింపు