‘‘దేశవ్యాప్తంగా పరిశీలిస్తే కొన్నిచోట్ల మినహా కొవిడ్ రెండోదశ ప్రభావం దాదాపుగా తగ్గింది. ప్రస్తుతం ఏపీలో కేసులు, మరణాలు పెరగడానికి డెల్టా వేరియంటే కారణం. దీని ప్రభావమూ క్రమంగా తగ్గుతోంది. కేరళలో యాంటీబాడీస్ వృద్ధి చెందిన వారు 40% మాత్రమే ఉండటంతోనే ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెల్టా కంటే తీవ్రమైన వేరియంట్ వస్తేనే మూడో దశ ప్రభావం అధికంగా ఉంటుంది’ అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ ఎన్.నందికూరి అభిప్రాయపడ్డారు. ఏపీలోని విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ సర్వైలెన్స్ కేంద్రం ఏర్పాటులో భాగంగా స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈటీవీ భారత్తో మాట్లాడారు.
ఇన్ఫ్లూయెంజా స్థాయికి కరోనా
‘‘ప్రపంచంలో 1918లో ఇన్ఫ్లూయెంజా మొదటిసారిగా వచ్చింది. దాని తీవ్రత తగ్గేందుకు రెండేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇన్ఫ్లూయెంజా కేసులు వస్తున్నాయి. కానీ... ఆందోళన చెందేంతగా లేవు. ప్రస్తుత కరోనా వ్యాప్తి మొదలై రెండేళ్లు పూర్తవుతోంది. రెండింటినీ పోలిస్తే... ఈ వైరస్ కూడా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జర్మనీ విధానాన్ని పాటిస్తే మేలు
కొవిడ్ జాగ్రత్తలతోపాటు వెలుతురు బాగుండే వాతావరణంలో విద్యా సంస్థలు నడిస్తే అంతగా ప్రమాదం ఉండదు. జర్మనీలో ఇదే విధానాన్ని పాటించగా వైరస్ ప్రభావం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.