తెలంగాణ

telangana

ETV Bharat / city

'అమెరికా విధానం అందుబాటులోకి తేవాలి' - సీసీఎంబీ డైరెక్టర్​ ఇంటర్వ్యూ

కరోనా నివారణకు ప్రత్యేకమైన వ్యాక్సిన్‌, ఔషధాలు ఇంకా అందుబాటులోకి రాలేదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా స్పష్టం చేశారు. అమెరికాలో మాదిరిగా ఇక్కడా వేగంగా ఫలితాలు వచ్చే పరీక్షా కిట్లు తీసుకురావాలని ప్రభుత్వాలకు సూచించారు. సీసీఎంబీలో రోజుకు 200నుంచి 300దాకా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రత తప్పక పాటించాలని సూచిస్తున్న సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రాతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.

ccmb director rakesh mishra interview with etv bharat
'అమెరికా విధానం అందుబాటులోకి తేవాలి'

By

Published : Apr 9, 2020, 6:55 AM IST

Updated : Apr 9, 2020, 7:44 AM IST

'అమెరికా విధానం అందుబాటులోకి తేవాలి'

ప్ర: సీసీఎంబీలో కరోనా పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారు?

జ: పరీక్షలన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. గతంలో రోజుకు 200నుంచి 300 వరకు పరీక్షలకే పరిమితమయ్యాయి. ఇకపై మరిన్ని చేస్తాం. అయితే కొన్ని పరిమితులు తప్ప మిగతా అంశాల్లో అంతా సవ్యంగా జరుగుతోంది.

ప్ర: పరీక్షా పరికరాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందా।? లేక ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి మీరే సేకరిస్తున్నారా?

జ: సీసీఎంబీలో వైరస్‌కు సంబంధించి అన్ని రకాల వైద్య పరికరాలు, ల్యాబోరేటరీలు ఉన్నాయి. మా వద్ద పెద్ద సంఖ్యలో పరికరాలున్నందున వాటి అవసరం అంతగా లేదు. మేము వాడుతున్న పరికరాలకు సంబంధించి ప్రభుత్వాన్ని కూడా పెద్దగా కోరడం లేదు.

ప్ర: మీరు కొన్ని రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో ఇప్పటివరకూ ఎన్ని టెస్ట్‌లు చేశారు. అదే విధంగా ఒక పరీక్ష పూర్తి చేసి ఫలితం రావడానికి ఎంత సమయం పడుతోంది?

జ: టెస్ట్‌ ఐదారు గంటల్లోనే అయిపోతుంది. ఒక సెట్‌ నమూనాలు రెండు గంటల్లో వస్తే.. మరికొన్నింటికి మూడు గంటలు పడుతోంది. మేము ఏవో ఒకట్రెండు చేసి దాని ఫలితం కోసం ఎదురుచూడట్లేదు. మొత్తం కలిపి చేసేందుకు అధిక సమయం పడుతుంది కాబట్టి ఫలితం వచ్చేందుకు 12 నుంచి 15, 18గంటలు పడుతుంది. తర్వాతి రోజు పూర్తి ఫలితం వెల్లడవుతుంది.

ప్ర: కొన్ని దేశాల్లో కేవలం 5నిమిషాల్లోనే ఫలితం వస్తోంది. ఇది సాధ్యమేనా? ఒకవేళ ఇది సాధ్యమైతే మనం ఎందుకు చేయలేం?

జ: అవును. కొన్ని దేశాల్లో 5నిమిషాల్లోనే ఫలితం వస్తోంది. ఆ పరీక్షలు మన దేశంలో అందుబాటులో లేవు. ఒక కంపెనీ మాత్రమే ఆ పరికరాన్ని తయారు చేసింది. అవి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన వద్ద ఆ పరిస్థితి లేదు కాబట్టి అది మనం చేయలేం. మేము యాంటీ బాడీ బేస్డ్‌ టెస్ట్ ద్వారా ఇక్కడ 15, 20నిమిషాలు లేదా అరగంటలోనే వేగంగా ఫలితం రాబడుతున్నాం. పైగా వాళ్లు తక్కువ పరికరాలు, చిన్నపాటి ల్యాబోరేటరిలోనే చేస్తున్నారు. అయితే అలాంటి పరికరాలను తీసుకొచ్చి యాంటీ బాడీ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని మేము ప్రభుత్వాలను కోరుతున్నాం.

ప్ర: కొన్ని దేశాలు యాంటీ బాడీ టెస్ట్‌లో భాగంగా వైరస్‌ నుంచి కోలుకున్న వ్యక్తి సీరం సేకరించి దాని ద్వారా ప్రయోగాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే వాస్తవమేనా? మన దేశంలోనూ ఈ ప్రయోగాలు చేసేందుకు అవకాశముందా?

జ: ఇది వాస్తవమే. కానీ అది పరీక్ష కాదు. వైరస్‌ నుంచి కోలుకున్న వ్యక్తి శరీరంలో యాంటీ బాడీస్‌ సుమారు 2-3వారాల దాకా అంటిపెట్టుకుని ఉంటుంది. ఒకవేళ అలా సీరం తీసుకుని ఐసోలేట్‌ చేసి ప్లాస్మా రూపంలో మరో బాధితుడికి ఎక్కించడం చాలా ప్రమాదకరం.

ప్ర: కరోనాతో మరణాల రేటు చాలా తక్కువ ఉన్నప్పటికీ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్‌ బారిన పడిన వ్యక్తులు తాకిన కరెన్సీ, ఇతర వస్తువులు, ప్లాస్టిక్‌, కాగితాన్ని తామూ ముట్టుకుంటే కరోనా వస్తుందని అనుమానిస్తున్నారు. ఇది వాస్తవమేనా? కాగితాలపై వైరస్‌ ఎన్ని రోజల వరకు ఉంటుంది?

జ: అవును మీరు చెప్పింది సరైనదే. ఒకవేళ నాకు కరోనా ఉండి ఉమ్మివేసిన ప్రాంతాన్ని మీరు తాకితే అది కచ్చితంగా సంక్రమిస్తుంది. అప్పుడు మీరు వెళ్లి తాకిన వస్తువులను వేరేవరైనా ముట్టుకుని చేతులను నోటికి తాకిస్తే వారికి వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి కాబట్టే మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. పత్రికలు, ఇతర వస్తువులపై వైరస్‌ సుమారు 4-5గంటలు ఉంటుంది. అందువల్లే అనేక విమానాశ్రయాల్లో వచ్చే కార్గో వస్తువులను కనీసం 8గంటల వరకు ముట్టుకోవడం లేదు. అయితే స్టీల్‌ మీద ఎక్కువ రోజులు ఉంటుంది. రాగి మీద తక్కువ సమయం జీవిస్తుంది. ప్లాస్టిక్‌ అయితే మరీ ప్రమాదకరం. ప్లాస్టిక్‌ను వీలైనంత వరకూ వాడకపోవడంతో పాటు ఇతరులకు దూరంగా ఉండాలి. తరచూ సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కొని క్షేమంగా ఉండొచ్చు.

ప్ర: చిన్నారులపై వైరస్‌ ప్రభావం తక్కువగా ఉండడానికి ఏవైనా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?

జ: వివిధ దేశాల్లో పరిస్థితులను గమనిస్తే... యువకులపై వైరస్‌ ప్రభావం చాలా తక్కువగా ఉంది. మన దేశంలో 15, 20ఏళ్ల లోపు పిల్లల్లో కరోనా ప్రభావం పరిమితంగా ఉంది. యువకుల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.. కాబట్టి వైరస్‌ బారిన పడినా సులువుగా కోలుకుంటున్నారు. వివిధ దేశాల్లోనూ గణంకాలను పరిశీలిస్తే.. యువకులపై ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ... మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.

ప్ర: కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడూ తన స్వభావాన్ని మార్చుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇది వాస్తవమేనా? దీనికి ఏవైనా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?

జ: ఈ కరోనా వైరస్‌ కుటుంబంలోని క్రీములు చాలా వేగంగా తమ స్వభావాలను మార్చుకుంటాయి. ఈ కారణంగానే మనకు కచ్చితమైన వ్యాక్సిన్‌, ఔషధాలు అందుబాటులో లేవు.

ప్ర: కొన్ని రకాల వ్యాక్సిన్లు కరోనా నివారణలో దోహదపడుతున్నాయని అంటున్నారు. ఇది వాస్తవమేనా?

జ: ఇప్పటి వరకైతే కరోనా నివారణకు కచ్చితమైన వ్యాక్సిన్‌ ఏదీ అందుబాటులో లేదు.

ప్ర: కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి?

జ: ఈ వైరస్‌ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. మీరు ఎవరిని తాకకూడదు. ఒకవేళ ఎవరైనా మీ సమీపంలో వచ్చి దగ్గినా.. తుమ్మినా.. మీరు భయపడకుండా వెంటనే వెళ్లి సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కొని క్షేమంగా ఉండొచ్చు. ఇంట్లో ఉండకుండా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికెళ్లాల్సి వస్తే... తప్పక మాస్కులు ధరించాలి. వైద్య సిబ్బందికైతే ఇది చాలా అవసరం.

ఇదీ చూడండి:రాష్ట్రంలో తగ్గనున్న కరోనా మహమ్మారి!

Last Updated : Apr 9, 2020, 7:44 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details