అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని వైకాపా గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హితవు పలికారు. ప్రజా చైతన్యంతో ప్రాథమిక హక్కులు కాపాడేందుకు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్యం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ' అనే అంశంపై ఆన్లైన్లో న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు..ప్రజాస్వామ్య వాదులు చేసే ప్రతి పోరాటంలో తెదేపా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. "ప్రత్యర్థులపై దేశద్రోహం కేసు పెడతారని నాకు తెలియదు. మీడియాపైనా రాజద్రోహం కేసుపెట్టే పరిస్థితికి వచ్చారు. వాస్తవాలు రాయకుండా మీడియా నియంత్రణకు ప్రయత్నం చేస్తున్నారు. చట్ట ఉల్లంఘనలు ఎలా చేస్తున్నారో ప్రజలు గమనించాలి. మేం ఎప్పుడూ కుల ప్రస్తావనతో ఎదురుదాడి చేయలేదు. కోర్టు సెలవులు చూసి మరీ జేసీబీలతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. హద్దు దాటే అధికారులకు భవిష్యత్తులో ఇబ్బంది తప్పదు." అని చంద్రబాబు వ్యాఖ్యనించారు.