కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వెళ్లడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. గెజిట్ నోటిఫికేషన్‌పై పూర్తిగా అధ్యయనం చేశాక తాము స్పందిస్తామని తెలిపారు. గుండెపోటు వచ్చి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ, గన్నవరం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు బచ్చుల అర్జునుడిని శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పును, ప్రస్తుత అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని ఆయన వివరించారు.
ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్లడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించేవారు ఎవరైనా నోటిఫికేషన్‌ను స్వాగతించబోరని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తెదేపా ఎంతవరకైనా పోరాడుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోయేలా వ్యవహరిస్తోందని, సీఎం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట తెదేపా నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్ తదితరులున్నారు.