ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. మేడేపల్లి నుంచి వాహనాలతో ర్యాలీగా వేలేరుపాడు మండలం చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను, గృహాలను చంద్రబాబు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు.
అనంతరం.. శివకాశీపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం దగ్గర అమరావతి రాజధాని రైతులు.. వెయ్యి మంది బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కొందరు బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు. శివకాశీపురంలో బాధితులు.. పరిహారం, పునరావాసం, వరదల సాయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుకు ఏకరవు పెట్టారు.
మూడేళ్లుగా ప్రజల కష్టాలు పట్టని ముఖ్యమంత్రి.. ఇప్పుడు బారికేడ్లు, పరదాల చాటున పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆకాశంలో తిరిగితే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. కొన్ని కూరగాయలు, ఓ రెండు వేలు చేతిలో పెడితే.. ప్రజలు కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతారని నిలదీశారు. హుద్‌హుద్ విపత్తు సమయంలో తెలుగుదేశం హయాంలో ఇచ్చిన జీవోను మెరుగుపరిచి మరింత ఉదారంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంటూర్ లెవల్ తగ్గించి.. సీఎం జగన్ కొత్తకుట్రకు తెరలేపారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై కేంద్రంతో పోరాడాల్సింది పోయి చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీలందరూ రాజీనామా చేసి.. డిమాండ్ చేస్తే పోలవరం ఎందుకు పూర్తికాదని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే.. పోలవరం ముంపు ప్రాంతాలన్నింటినీ కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు.