ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందనే విషయం మరోసారి రుజువైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా రాజధానిని అమరావతి ప్రజలు కాపాడుకున్నారన్నారు. విజయం సాధించిన అమరావతి ప్రజలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
అమరావతి ప్రజలు ప్రపంచంలోనే అత్యధిక భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఎలాంటి వివాదం లేకుండా 33 వేల ఎకరాల భూమి ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. భారీ వరదల్లోనూ ఒక్క ప్రాంతం కూడా ముంపునకు గురికాలేదన్నారు. ఎంతో ముందుచూపుతో పకడ్బందీగా సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకువచ్చానని వెల్లడించారు. రాజధాని విషయంలో వైకాపా నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు మండిపడ్డారు. మీ రాజధాని ఏదని అడిగితే మన పిల్లలు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 800 రోజులుగా ధర్నా చేస్తున్నా రైతులకు సమాధానం చెప్పలేదన్నారు. మహిళా రైతులపై విచక్షణరహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధే నా కులం..
తనకు కులమంటే తెలియదని.. ప్రజలు, అభివృద్ధే తన కులమని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ను ప్రజల కోసమే అభివృద్ధి చేశానని అన్నారు. తాను ఆలోచించిన ఔటర్‌రింగ్ రోడ్డు వల్ల అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పారు. అమరావతి చుట్టూ కూడా 187 కి.మీ. రింగ్‌రోడ్డుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. రింగ్‌రోడ్డు లోపల ప్రపంచస్థాయిలో 9 నగరాలు నిర్మించాలని భావించానన్నారు. రాజధాని భూములు కుదువపెట్టి రుణాలు తెచ్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు రూ.100 ఖర్చుపెడితే ప్రభుత్వానికే రూ.30 చేరుతుందని అన్నారు.
"ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైంది. వైకాపా నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రజా రాజధానిని అమరావతి ప్రజలు కాపాడుకున్నారు. మీ రాజధాని ఏదని అడిగితే చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారు. నాకు కులమంటే తెలియదు. ప్రజలు, అభివృద్ధే నా కులం. రాజధాని భూములు తనఖాపెట్టి రుణాలు తెచ్చుకోవాలని చూస్తున్నారు."
-చంద్రబాబు
వివేకా హత్య నాటకాలు..