Viveka Murder Case Updates : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కడప కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. వివేకాను హత్య చేయడానికి నలుగురు సహ నిందితులతో కలిసి కుట్ర పన్నారని, ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని సీబీఐ అభిప్రాయపడింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకోవాల్సిన తరుణంలో ఉమాశంకర్‌రెడ్డికి బెయిలివ్వడం సరైంది కాదని వాదించింది. వివేకా తలపై గొడ్డలితో తొలి దాడి చేసింది ఉమాశంకర్‌రెడ్డేనని దర్యాప్తులో తేలినట్లు స్పష్టం చేసింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులిచ్చింది.
Viveka Murder Case Updates : వివేకా తలపై తొలి గొడ్డలి వేటు ఉమాశంకర్‌రెడ్డిదే - viveka murder case news
Viveka Murder Case Updates : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కడప కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. వివేకా తలపై గొడ్డలితో తొలి దాడి చేసింది అతడేనని దర్యాప్తులో తేలినట్లు స్పష్టం చేసింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది.
![Viveka Murder Case Updates : వివేకా తలపై తొలి గొడ్డలి వేటు ఉమాశంకర్‌రెడ్డిదే viveka murder case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14814884-912-14814884-1648043821404.jpg)
Viveka Murder Case News : హత్య కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కడప నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ జరిగింది. వాచ్‌మెన్ రంగన్న, అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం వివేకాను హత్య చేసిన నలుగురిలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. వివేకాను ఆయన ఇంట్లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి కలిసి హత్య చేశారని, ఆ సమయంలో తిడుతూ గొడ్డలితో ఆయన తలపై తొలివేటు వేసింది ఉమాశంకర్‌రెడ్డేనని సీబీఐ దర్యాప్తులో తేలినట్లు కోర్టుకు నివేదించింది. వివేకాను స్నానపు గదిలో పడేసిన తరువాత మరో ఐదారుసార్లు తలపైన గొడ్డలితో ఉమాశంకర్‌రెడ్డే నరికాడని వివరించింది. హత్య జరిగిన రోజున వేకువజామున 3.15 గంటలకు పారిపోతున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించినట్లు తెలిపింది.
కేసు విచారణలో భాగంగా ఉమాశంకర్‌రెడ్డి ద్విచక్ర వాహనాన్ని, ఇంట్లోని రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ.. కడప కోర్టుకు తెలిపింది. ఈ సమయంలో బెయిలిస్తే హత్యకు వినియోగించిన ఆయుధాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని వాదించింది. ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. అందులో భాగంగానే గంగాధర్‌రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన తరువాత మాట మార్చారని పేర్కొంది. సీబీఐ లోతైన దర్యాప్తు చేస్తోందని.. బెయిలివ్వడం ద్వారా ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని పునరుద్ఘాటించింది. అసలైన కుట్రదారులను తెలుసుకునేందుకు ఉమాశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షలు చేయించడానికి పులివెందుల కోర్టులో పిటిషన్ వేస్తే, అతను నిరాకరించారని సీబీఐ గుర్తు చేసింది. ఇప్పటికే కడప కోర్టులో రెండు సార్లు, హైకోర్టులో ఓసారి బెయిల్ పిటిషన్ వేయగా న్యాయస్థానాలు కొట్టేసిన విషయాన్ని సీబీఐ తన కౌంటర్ పిటిషన్‌లో ఉటంకించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో దస్తగిరి, రంగన్న భద్రతపై సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.