Social Media Posts on Judges :సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టుల కేసులో అరెస్టు చేసిన నిందితులు.. ఏపీ ఉన్నత న్యాయస్థానం ప్రతిష్ఠ, విశ్వసనీయతకు విఘాతం కలిగేలా వ్యవహరించారని సీబీఐ తెలిపింది. న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రసంగాలు, పోస్టులు చేసినట్లు పేర్కొంది. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరుస్తూ, దూషిస్తూ, దురుద్దేశాలు ఆపాదిస్తూ, ప్రాణహాని కలిగిస్తామని బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న అభియోగాలపై.. 2020 నవంబర్ 11న సీబీఐ కేసు నమోదు చేసింది.
ముగ్గురు అరెస్టు..
Social Media Posts on AP Judges : ఈ కేసులో భాగంగా శనివారం.. మెట్ట చంద్రశేఖర్‌రావు, గోపాలకృష్ణ కళానిధి, గుంట రమేశ్ కుమార్‌ను అరెస్టు చేసింది. వీరిలో మెట్ట చంద్రశేఖర్‌రావు ఏపీ అసెంబ్లీకి, ఏపీఈపీడీసీఎల్ కి స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. గోపాలకృష్ణ కళానిధి సీనియర్ న్యాయవాది. గుంట రమేష్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ కేసులో ముగ్గురు నిందితుల ప్రమేయంపై సీబీఐ అధికారులు గుంటూరు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వేర్వేరుగా రిమాండు రిపోర్టులు దాఖలు చేశారు. అలాగే వారిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు వేశారు. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై దూషణకు సంబంధించిన భారీ కుట్ర వెనుక ఉన్న వ్యక్తుల పేర్లు, వివరాలు నిందితులు వెల్లడించడం లేదని.. ఆ వివరాలు వెలికితీయాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. నిందితులు ముగ్గురూ ప్రభావవంతమైన వ్యక్తులని, వారిని అరెస్టు చేయకపోతే ఆధారాలు ధ్వంసం చేసే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరించింది.
CBI Remand Report :న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ సమగ్రతను కించపరిచేలా నిందితులు మాట్లాడారని.. రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. సమాజంలో కులాలు, మతాల మధ్య శతృత్వం పెరిగేలా వ్యవహరించారంది. విశాఖ జిల్లాకు చెందిన వైద్యుడు సుధాకర్‌పై పోలీసుల దాడి కేసును సీబీఐకి అప్పగించే వ్యవహారంలో.. ఏపీ హైకోర్టు విచారణ, ఆదేశాల సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. 2020 మే 23న ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మెట్ట చంద్రశేఖర్‌రావు.. హైకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వివరించింది. హైకోర్టుపై వ్యాఖ్యలతో ఓ వీడియో రికార్డు చేసిన గోపాలకృష్ణ కళానిధి.. వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ఛానల్‌కు పంపించారని కోర్టుకు నివేదించింది. ఆ వీడియోను 2020 మే 20న సదరు ఛానల్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్లు చెప్పింది. ఈ వ్యవహారంలో యూట్యూబ్ ఛానల్ యాంకర్‌ను ప్రశ్నించి.. స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. హైకోర్టు పట్ల ప్రజల్లో విద్వేషాలు పెంచేలా గోపాలకృష్ణ వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ వెల్లడించింది. న్యాయమూర్తులపై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలతో 2020 మే 24న గుంట రమేష్‌కుమార్ ట్వీట్ చేశారని సీబీఐ తెలిపింది. ఆ ట్వీట్ తానే చేశానని విచారణలో అంగీకరించారని.. తన ట్విటర్ ఖాతా నుంచే ట్వీట్ చేసినట్లు సాక్షుల సమక్షంలోనే తెలిపారని సీబీఐ పేర్కొంది.
Comments on AP High Court : న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నిందితుల్ని ప్రభావితం చేసిన వారి వెనుక ఉన్న వ్యక్తులెవరో తేల్చాల్సి ఉందని సీబీఐ తెలిపింది. ఏ ఉద్దేశంతో నిందితులు వ్యాఖ్యలు చేశారు, మిగతా నిందితులతో వీరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వారి వ్యాఖ్యలకు మూలం ఎక్కడ ఉందనే అంశాలు తేల్చాల్సి ఉందని చెప్పింది. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉందని.. నిందితులను కస్టడీకి ఇస్తే వివరాలన్నీ రాబడతామని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మొత్తం పది ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు తెలిపింది. కొన్ని ఆధారాలు సేకరించినట్లు వివరించింది.