CBI inquiry on posts against judges case: జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ.. హైదరాబాద్‌లో ముగ్గురిని ప్రశ్నించింది. ఈ మేరకు న్యాయవాదులు గోపాలకృష్ణ, మెట్ట చంద్రశేఖర్‌తోపాటు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నూ విచారించారు. ఈ ముగ్గురిని దర్యాప్తు అధికారులు.. విజయవాడకు తరలిస్తున్నారు.
ట్విట్టర్ వివరణ..
social media posts against judges case: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై ఫిబ్రవరి 7న ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న ట్విట్టర్.. అఫిడవిట్ దాఖలు చేసింది. జడ్జిలపై వ్యాఖ్యలు ఇక నుంచి కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పూర్తి వివరాలు తెలిపామని హై కోర్టుకు విన్నవించారు. అఫిడవిట్‌లో చెప్పినవి నిజమో కాదో చూడాలని ఉన్నత న్యాయస్థానం.. సీబీఐని ఆదేశించింది. మెమో దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ఆగ్రహం
అంతకుముందు జరిగిన విచారణ సందర్భంగా సామాజిక మాధ్యమాల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించే వ్యవహారంలో సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయస్థానంతో దోబూచులాడుతున్నాయని ఆక్షేపించింది. అభ్యంతరకర యూఆర్ఎల్ లను(యూనిఫాం రిసోర్స్ లొకేటర్) తొలగించాలని సీబీఐ కోరితే 36 గంటల్లో ఎందుకు తొలగించలేదని ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమ కంపెనీలపై మండిపడింది.
తొలగించాల్సిందే
గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతున్నాయని, సరైన స్పూర్తితో అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. ఫలానా పోస్టులు తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్(ఆర్బీ) లేదా కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోరితే తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొన్ని యూఆర్ఎల్స్ను తొలగించలేదని సీబీఐ, తొలగించామని సామాజిక మాధ్యమ సంస్థలు చెబుతున్న నేపథ్యంలో.. ఇరువురిలో ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్ని యూఆర్ఎల్స్ను తొలగించాలని కోరారో.. ఆ వివరాలను సామాజిక మాధ్యమాలకు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఎన్ని తొలగించారు..? మిగిలినవి తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను ఆదేశించింది. మరోవైపు సీబీఐ అధికారులు కూడా కేసులో ఉన్న ప్రతి ఒక్కర్నీ విచారించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది.
ఇదీ చదవండి :CM KCR Yadadri Tour Speech: దేశం తిరోగమిస్తున్నా... తెలంగాణ పురోగమిస్తోంది: సీఎం కేసీఆర్