న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ సోమవారం నాలుగు అభియోగపత్రాలు దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ధనిరెడ్డి కొండారెడ్డి, ఏ3 పాముల సుధీర్, ఏ4 ఆదర్శ్ పట్టపు అలియాస్ ఆదర్శ్ రెడ్డి, ఏ6 లవనూరు సాంబశివారెడ్డి అలియాస్ శివారెడ్డి ప్రమేయంపై వాటిల్లో ప్రస్తావించింది. ఈ ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య ఈ నలుగుర్ని అరెస్టు చేసింది. తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించింది. ప్రస్తుతం వీరంతా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు దురుద్దేశాలు, కులాలు, అవినీతి ఆరోపణలు ఆపాదిస్తూ వారి ప్రాణాలకు హాని కలిగిస్తామని బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనేది వీరిపై ప్రధాన అభియోగం. ఈ మేరకు గుంటూరులోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం (సీబీఐ డిజిగ్నేటెడ్ కోర్టు)లో వేర్వేరుగా నాలుగు అభియోగపత్రాల్ని సీబీఐ వేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకూ సీబీఐ ఐదు అభియోగపత్రాల్ని దాఖలు చేసినట్లయింది. ఈ ఏడాది జులైలో కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసి.. అతని ప్రమేయంపై ఈ నెల 2న సీబీఐ అభియోగపత్రం వేసింది. ఈ కేసులో అతను 15వ నిందితుడు.
దర్యాప్తు కొనసాగుతోంది...
ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాల్ని ఆపాదిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదుపై గతేడాది ఏప్రిల్ 16 నుంచి జులై 17 వరకు ఆంధ్రప్రదేశ్ సీఐడీలోని సైబర్ నేరాల విభాగం మొత్తం 12 కేసుల్ని నమోదు చేసింది. వాటిల్లో 16 మందిని నిందితులుగా పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది నవంబరు 11న ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐ చేపట్టింది. స్వభావం రీత్యా ఈ 12 కేసులు ఒకే తరహాలో ఉన్నందున.. వాటన్నింటిపై ఒకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 16 మందిని నిందితులుగా పేర్కొంది. వారిలో ఐదుగురు నిందితులకు సంబంధించి అనుచిత పోస్టుల వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం ఉందనేది వివరిస్తూ ఇప్పటివరకూ అభియోగపత్రాలు వేసింది. మిగతా 11 మంది నిందితుల్లో ముగ్గురు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిని ఇక్కడకు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. మణి అన్నపురెడ్డి, అభిషేక్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, జి.శ్రీధర్‌రెడ్డి, ఎం.లింగారెడ్డి, ఎం.చందురెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్‌రెడ్డి దరిశ, చిరంజీవి, కె.గౌతమి తదితర నిందితులకు సంబంధించిన ప్రమేయంపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రాథమికంగా గుర్తించిన నిందితుల జాబితాలోని వారే కాకుండా ఈ వ్యవహారంలో ఇతరుల పాత్రపై కూడా సీబీఐ సమాచారం సేకరించింది.
పోస్టుల తొలగింపు
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అనుచిత పోస్టులకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత.. ఆయా పోస్టులన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో నుంచి, ప్రజాబాహుళ్యం నుంచి తొలగించినట్లు, కొందరు ఆయా సామాజిక మాధ్యమాల ఖాతాల్ని మూసేసినట్లు సీబీఐ అభియోగపత్రాల్లో ప్రస్తావించింది. ఆయా పోస్టులకు సంబంధించిన డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌ను కూడా సీబీఐ విశ్లేషించింది.