న్యాయస్థానాల్లో కొన్ని కేసులు వీగిపోవడం.. మరికొన్నింటిలో శిక్షలు పడటం సాధారణమే. కానీ రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా రుజువు కాలేదు. 69 కేసులు వీగిపోయాయి.
ఏడాదిన్నర తర్వాత జడ్జి నియామకం
చట్టసభల్లోని నేతలపై వచ్చిన నేరాభియోగాలపై సత్వర విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. 2018 ఫిబ్రవరి 28న తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసుల విచారణ కోసం హైదరాబాద్లో సెషన్స్ జడ్జి హోదాలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ముప్ఫై మంది సిబ్బందిని నియమిస్తూ మార్చి 2న ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన దాదాపు ఏడాదిన్నర పాటు న్యాయాధికారిని నియమించలేదు. ఏడాదిన్నర క్రితం జడ్జిని నియమించినా ఇప్పటి వరకు పూర్తిస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేరు. మంజూరైన పోస్టుల్లో 16 మందిని నియమించగా.. మిగతావి భర్తీ కాకపోవడం వల్ల కేసుల విచారణపై ప్రభావం కనిపిస్తోంది.
509పై కేసులు
ఎంపీలు, ఎమ్మెల్యేలపై రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఉన్న క్రిమినల్ కేసుల బదిలీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టుకు 245 కేసులు బదిలీ అయ్యాయి. వాటిలో 2018లో 100 కేసులు, 2019లో 39, గతేడాది 106 కేసులున్నాయి. స్పెషల్ కోర్టులో ప్రస్తుతం 172 కేసుల్లో వివిధ దశల్లో విచారణ జరుగుతోంది. రాష్ట్రంలోని 41 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరో 15 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతోంది. కానీ 2018 ఎన్నికల్లో ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ఎమ్మెల్యేలపై దాదాపు 509 కేసులు ఉన్నట్లు సుపరిపాలన వేదిక చెబుతోంది. రాష్ట్రంలోని పది మంది ఎంపీలపై 133 కేసులు, 67 మంది ఎమ్మెల్యేలపై సుమారు 150 కేసులు ఉన్నట్లు వారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం తెలుస్తోందని సుపరిపాలన వేదిక వెల్లడించింది.
ఒక్కటీ రుజువు కాలేదు
ప్రత్యేక కోర్టు ఏర్పాటైన తర్వాత 69 కేసుల్లో విచారణ పూర్తి కాగా.. మరో 4 కేసులు ఇతర న్యాయస్థానాలకు బదిలీ అయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు యాభై కేసులను కొట్టివేసింది. మరో ఇరవై కేసులు అభియోగాల నమోదు కూడా కాకముందే డిశ్చార్జ్ అయ్యాయి. ఒక్క కేసు కూడా రుజువు కాకపోవడానికి పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 50 పోలీస్ స్టేషన్ల నుంచి ఎవరూ హాజరు కావడం లేదని దానివల్ల కేసుల విచారణ ముందుకు సాగడం లేదని ప్రత్యేక కోర్టు న్యాయాధికారి గతేడాది జనవరిలో డీజీపీకి లేఖ రాశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.