కామారెడ్డి జిల్లా తెరాస కార్యాలయానికి భూకేటాయింపు విషయంలో ఎమ్మెల్యే గోవర్దన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సహా పలువురు అధికారులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
తెరాస కార్యాలయ భూకేటాయింపుపై హైకోర్టు నోటీసులు - case on trs party office at kamareddy
14:36 December 18
తెరాస జిల్లా కార్యాలయం కోసం కామారెడ్డి మండలం వడ్లూరు గ్రామంలో సర్వే నెంబరు 527లోని ఎకరం 20 గుంటల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరాసకు కేటాయించింది. అయితే తమ భూమిని చట్టవిరుద్ధంగా తెరాసకు కేటాయించారంటూ స్థానికులు నాగన్నగారి ప్రతాప్ రెడ్డి, బూసాని ప్రభాకర్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు పిటిషనర్లు ఉన్న భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశిస్తూ సెప్టెంబరు 9న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ... తమ భూముల్లో తెరాస కార్యాలయ నిర్మాణం కొనసాగిస్తున్నారంటూ పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం... ప్రతివాదులుగా ఉన్న కామారెడ్డి ఎమ్మెల్యే గోవర్దన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ కె.రాజేంద్ర కుమార్, తహశీల్దార్ జి.రాజేందర్ కుమార్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
ఇప్పటికే ఎకరం స్థలంలో తెరాస కార్యాలయం నిర్మిస్తున్నారని.. మిగతా 20 గుంటలు కూడా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉన్నందున.. పోలీసుల రక్షణ కల్పించాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల అభ్యర్థనను నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల్లో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.