ప్రజారవాణాలో మెట్రో కీలకంగా మారింది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా వేగంగా ప్రయాణికులు గమ్యస్థానం చేరేందుకు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రెండోదశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రతిపాదించారు. ఇది ఎక్స్‌ప్రెస్ మెట్రో. పరిమితంగా మెట్రో స్టేషన్లు ఉంటాయి. అరగంటలో విమానాశ్రయం చేరుకునేలా ప్రణాళికలు రచించారు. రెండో దశలోనే లక్డీకాపూల్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు, నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు. ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మూడు మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సర్కారు వద్ద ఉంది. దాదాపు రూ.పదివేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ నెల 18న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌పై నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు.
మెట్రోకు బడ్జెట్‌లో నిధులు దక్కేనా? - Hyderabad metro news
మెట్రో రెండోదశ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర బడ్జెట్‌లోనైనా నిధులు దక్కేనా? మెట్రో విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. నిధులులేక అడుగు కూడా ముందుకు పడటం లేదు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) సిద్ధమై రెండేళ్లు అవుతోంది. దిల్లీ మెట్రోరైలు సంస్థ డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణను రెండోదశలో మొదటి ప్రాధాన్యంగా ప్రతిపాదించారు. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి చూపారు. ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తేనే ప్రాజెక్ట్‌లో కదలిక వస్తుంది.
మెట్రోరైలు కారిడార్-2 వాస్తవంగా జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు. పాతబస్తీలో అలైన్‌మెంట్ వివాదాలతో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మాత్రమే పూర్తిచేశారు. ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాతబస్తీ 5.5 కి.మీ. పనులు చేపట్టకుండానే ఎల్ అండ్ టీ మెట్రో మొదటి దశను పూర్తిచేసింది. సర్కారు నిధులతోనే మిగిలిన పనులు చేయాలి. ఇందుకు ఎంతలేదన్నా వెయ్యి కోట్ల రూపాయలపైనే అవుతుందని అంచనా. ఆలస్యం అయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఏటా రూ.500 కోట్లు కేటాయించినా రెండు మూడేళ్లలో పాతబస్తీ పనులు పూర్తిచేయవచ్ఛు మెట్రో విస్తరణలోనూ కదలిక ఉంటుంది.
పాతబస్తీకి మెట్రో రావాలన్నా..
పాతబస్తీలో మెట్రో పనులకు చేపట్టేందుకు మెట్రో అధికారులు ఏటా సర్కారుకు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇక్కడ సివిల్ పనులతో పాటూ ఆస్తుల సేకరణకు నిధులు కావాలి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు సేకరించాల్సిన ఆస్తుల మార్కింగ్ కొన్నేళ్ల కిందటే పూర్తయ్యింది. ‘రైట్ ఆఫ్ వే’ కోసం వెయ్యి వరకు ఆస్తులను గుర్తించారు. పనులను మొదలెట్టాలంటే మొదట భూసేకరణ చేపట్టి రహదారి విస్తరించాల్సి ఉంది. ఈసారి బడ్జెట్‌లో ప్రత్యేకించి పాతబస్తీ మెట్రోకి నిధులు కేటాయిస్తేనే అడుగులు ముందుకు పడేది.
- ఇదీ చూడండి :రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో జీఎస్టీ విడుదల