తెలంగాణ

telangana

ETV Bharat / city

నాలుగో దశ పల్లెపోరులో కీలకంగా మారిన కర్నూలు జిల్లా - కర్నూలు పశ్చిమ ప్రాంతంలో జోరుగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం

నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు.. అభ్యర్థుల ప్రచారంతో కర్నూలు పశ్చిమ ప్రాంతం హోరెత్తుతోంది. మొత్తం 292 స్థానాలకు 27 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 265 గ్రామాల్లో పల్లె పోరు జరగనుంది. ఆయా పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ముగియగానే అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. తమను గెలిపించాలంటూ వారు ప్రజల చుట్టూ తిరుగుతున్నారు.

నాలుగో దశ పల్లెపోరులో 27 ఏకగ్రీవం.. 265 చోట్ల పోలింగ్
నాలుగో దశ పల్లెపోరులో 27 ఏకగ్రీవం.. 265 చోట్ల పోలింగ్

By

Published : Feb 17, 2021, 7:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 27 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు. 14 మండలాల్లోని 292 పంచాయతీలకు.. ఏకగ్రీవం కాగా మిగిలిన 265 గ్రామాల్లో ఈనెల 21న పోలింగ్ జరగబోతుంది. ఆదోని, ఆస్పరి, నందవరం మండలాల్లో ఎలాంటి ఏకగ్రీవాలు కాలేదు. ఉపసంహరణల పర్వం ముగియగానే అభ్యర్థులు ప్రచారానికి తెర లేపారు. ఎన్నికల సంఘం ప్రకటించిన గుర్తులతో ఊరంతా తిరుగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ తమ గుర్తులను ఉంచి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

పీఠం దక్కించుకున్న పంచాయతీలివే...

  • ఆలూరు మండలంలోని సర్పంచి స్థానాలకు హత్తిబెళగల్‌(షేకున్‌బీ), కమ్మరచేడు(సుమతి) గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.
  • చిప్పగిరి మండలంలో గుమ్మనూరు(పి.లక్ష్మీదేవి), ఖాజీపురం(ఎం.రమాదేవి), నంచర్ల(భీమన్న) అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • దేవనకొండ మండలంలో సర్పంచి అభ్యర్థులైన అమరావతి లక్ష్మీదేవి(మాచాపురం), పింజరి శేఖమ్మ(కొత్తపేట), గొల్ల ఈరమ్మ(కుంకనూరు), హాలహర్వి పరిధిలో మెదేహాల్‌(ఉమాదేవి), కామినహాల్‌(పద్మజ), హొళగుందలో హోన్నూరు (శారద)లు ఏకగ్రీవాలైనట్లు అధికారులు ప్రకటించారు.
  • కోసిగి మండలంలో జంపాపురం(ఆరోన్‌), గౌడగల్లు(శివమ్మ), నేలకోసిగి(హనుమంతమ్మ), సజ్జలగుడ్డం(నర్సమ్మ), పెద్దభూంపల్లి(నాగవేణి), కౌతాళం పరిధిలో మల్లనహట్టి(శాంతమ్మ), పెద్దకడబూరు పరిధిలో పీకలబెట్ల(మూలింటి లక్ష్మి) పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
  • మంత్రాలయం పరిధిలో ఏడు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. కాచాపురంతోపాటు, ఖగ్గల్‌(రూసమ్మ), మాధవవరం (ఇందిరమ్మ), సింగరాజనహళ్లి(మధుసూధన్‌రెడ్డి), రాంపురం(ఉరుకుందమ్మ), 52బసాపురం(రాఘవరెడ్డి), సౌలహళ్లి(రాధ) ఉన్నాయి.
  • ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్వగ్రామం కడిమెట్ల(పెద్దమారెప్ప), గోనెగండ్ల మండలం నెరుడుప్పల(కురవ భీమక్క) ఏకగ్రీవాలైనట్లు అధికారులు ప్రకటించారు.

ఎమ్మెల్యే సతీమణి ఏకగ్రీవంగా...

మంత్రాలయంలోని కాచాపురంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఒకప్పుడు సర్పంచిగా గెలిచారు. గత ఎన్నికల్లో ఈ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఆయన సతీమణి వై.జయమ్మ ఏకగ్రీవంగా నెగ్గారు. ప్రస్తుత పల్లెపోరులోనూ ఆమె గెలుపు ఏకగ్రీవమైంది.

ఆ గట్టు నుంచి ఈ గట్టుకి...

దేవనకొండ మండలంలోని కుంకునూరు పంచాయతీలో పవిత్ర, తిప్పమ్మ, గొల్ల ఈరమ్మ అనే ముగ్గురు నామినేషన్లు వేశారు. వారిలో ఇరువును నామినేషన్లు ఉపసంహరించుకుని గొల్ల ఈరమ్మ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. తొలుత కొందరి మద్దతుతో ఆమె బరిలోకి దిగగా.. ఏకగ్రీవం అయ్యాక వేరొకరి వల్ల గెలిచినట్లు మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు కండువా కప్పి వెళ్లిపోయారు. అనుకోని ఈ ఘటనతో తొలుత అండగా నిలిచిన వారందరూ అవాక్కయ్యారు.

మంత్రాలయంలో... పట్టు విడిచారు

మేజర్‌ పంచాయతీ, నియోజకవర్గ ప్రధాన కేంద్రం మంత్రాలయంలో భారీ వ్యూహాలతో పలువురు అడుగులు వేశారు. వార్డుల విషయంలో వాటాల పర్వానికి తెర లేపారు. మొత్తం 16 వార్డులకుగాను ఒక వర్గం ఎనిమిదిని ఏకగ్రీవం చేసుకుంది. మరొక స్వతంత్ర అభ్యర్థీ అదే దారిలో నడిచారు. మిగిలిన ఏడింటికి ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి బరిలో ఉన్న చిన్న భీమన్న నామినేషన్‌ ఉపసంహరించుకోగా.. స్వతంత్ర అభ్యర్థి వడ్డె నారాయణ, భీమయ్య ఎన్నికల బరిలో మిగిలారు. చిన్న భీమన్న సమీప బంధు వర్గం ద్వారా నామినేషన్‌ ఉప సంహరణకు పావులు కదిపినట్లు తెలుస్తోంది. లేకుంటే ఇక్కడ ఎన్నిక హోరాహోరీగా జరిగేది.

ఇదీ చదవండి:పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details